‘సలార్’ సినిమా ప్రారంభమైన తొలి రోజుల్లో ఓ వార్త వచ్చింది మీకు గుర్తుందా? సినిమా సంగీత దర్శకుడు రవి బ్రసూర్ చెప్పారంటూ ఓ పుకారు బయటికొచ్చింది. అందులో నిజానిజాల సంగతి అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత ఆ సినిమా టీమ్ నుండి ఇంకొకరు స్పందిస్తూ ‘అలానే ఉండొచ్చు కానీ అది కాదు. అలానే ఉన్నా ప్రతిసారి ప్రశాంత్ నీల్ కొత్తగా చూపిస్తారు’ అని ఏదో అన్నారు. ఇదంతా ‘ఉగ్రమ్’ సినిమాతో ‘సలార్’కు పోలిక గురించే అనే విషయం గుర్తొచ్చి ఉంటుంది.
ఇప్పుడు మళ్లీ అదే విషయం చర్చకు వస్తోంది. ఈసారి కారణం ఇంకెవరో చెప్పడం కాదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాటల్లోనే బయటకు వచ్చింది. దాంతోపాటు ఇన్నాళ్లూ అవునా? కాదా? అనుకుంటున్న మరో విషయంలోనూ క్లారిటీ వచ్చింది. ముందు దాని సంగతి చూద్దాం. ప్రశాంత్ నీల్ గత రెండు సినిమాలు ‘కేజీయఫ్ 1’, ‘కేజీయఫ్ 2’కి… ‘సలార్’కి లింక్ ఉందని, ఇవన్నీ సినిమాటిక్ యూనివర్స్‌లోకి వస్తాయని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదు అని ఇప్పుడు ప్రశాంత్ నీల్ అంటున్నారు.
‘సలార్’కు మరే సినిమాతో సంబంధం ఉండు, అదొక భిన్నమైన కథ అని (Prashanth Neel) ప్రశాంత్ చెప్పారు. రెండు సినిమాలకు కనెక్షన్ ఉందనుకున్న వారిని నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు అని కూడా కోరారు ప్రశాంత్ నీల్. అలాగే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడమే ‘సలార్’ సినిమా కథాంశం అని ఆయన చెప్పేశారు. అంతేకాదు ఈ సినిమా స్టోరీని ‘కేజీయఫ్’ సినిమాలకు ముందే రాసుకున్నానని అని కూడా తెలిపారు. దీంతో మొత్తంగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో పార్ట్ 1 ‘సలార్: ది సీజ్ ఫైర్’ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను డిసెంబరు 1న విడుదల చేస్తారని సమాచారం. ఇక తొలి పుకారు సంగతే కదా… ప్రశాంత్ నీల్ గతంలో చేసిన ‘ఉగ్రమ్’ సినిమాలో కూడా ఇలానే ఇద్దరు స్నేహితులు విరోధులుగా మారతారు. అందుకే ఆ కథే ఈ కథనా అనే డౌట్ వస్తోంది.