టాలీవుడ్‌లో నేటి తరం దర్శకుల్లో ప్రయోగం అంటే ముందుకొచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ‘ఆ!’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కూడా ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రయోగాల పరంపరలో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. తొలి సినిమాలోనే నలుగురైదుగురు కీలక పాత్రధారులతో సినిమా చేసిన ప్రశాంత్ వర్మ.. ఈ సారి ఏకంగా పది మంది కథానాయికలతో సినిమా చేయాలని చూస్తున్నారట.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాఉ. తేజతో ‘హను – మాన్’ చేస్తున్న ప్రశాంత్ వర్మ ఇటీవల ‘అధీర’ అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ మరో సినిమా కథ మీద కూర్చున్నారట. అదే ఈ పది మంది హీరోయిన్ల సినిమా అంటున్నారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో రాలేదు అని చెబుతున్నారు. పాత్రకు పాత్రకు ముడివేస్తూ చివర్లో ఆ చిక్కుముడులన్నీ విప్పుతారట.
ఈ క్రమంలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారట. దీని కోసం డిఫరెంట్ స్క్రీన్ ప్లేను రాసుకునేపనిలో ఉన్నారట ప్రశాంత్ వర్మ. ఓవైపు స్క్రీన్‌ప్లే రెడీ చేస్తూనే మరోవైపు హీరోయిన్ల ఎంపిక కూడా చేస్తున్నారట. ఈ క్రమంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదించారని సమాచారం. త్వరలో ఆమె ఎంట్రీపై క్లారిటీ వస్తుందట. ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలు చూస్తే ప్రయోగాలు పెద్ద లెక్క కాదు అని తెలిసిపోతుంది.
‘ఆ!’లో ఒకే పాత్రను వివిధ పాత్రలో చూపిస్తే ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ‘కల్కి’ లాంటి డిఫరెంట్ సినిమా చేశాడు. ఆ తర్వాత తెలుగులో తొలి జాంబీ సినిమా ‘జాంబీ రెడ్డి’ చేశారు. ‘అద్భుతం’ సినిమా కథ కూడా కొత్తదే. ఇప్పుడు చేస్తున్న ‘హను మాన్’ చేస్తున్నాడు. ఆ తర్వాత ‘అధీర’ చేస్తాడు. ఆ తర్వాత పది మంది హీరోయిన్ల సినిమానే.