క్రౌడ్ ఫండింగ్… ఇది ఇప్పటి మాట ఏం కాదు. కొన్నేళ్ల క్రితం తెలుగులో ఇలా జనాలను డబ్బులు అడిగి వాటితో సినిమాలు తీసేవాళ్లు. అలా చేసిన సినిమాలు కొన్ని విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి కూడా. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే… తెలుగులో మరో సినిమా క్రౌడ్ ఫండింగ్ కోసం సిద్ధమైంది. ‘సినిమా తీయడానికి డబ్బులు కావాలి ఇస్తారా?’ అంటూ ఓ యువ దర్శకుడు సోషల్ మీడియాలోకి వచ్చారు. ఆయనే వెంకటేశ్ మహా. డిఫరెంట్ సినిమాలు తీస్తారు అని పేరున్న ఆయన… ఇప్పుడు డిఫరెంటగా ఆలోచించి క్రౌడ్ ఫండింగ్‌కి వచ్చారు.
ఇటీవల కాలంలో సినిమాతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు వెంకటేష్ మహా. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి విలక్షణ సినిమాలు తీసిన ఆయన ‘కేజీయఫ్’ గురించి కొన్ని మాటలు అని.. ట్రోలింగ్ బారిన పడ్డారు. అయితే మాట మార్చేది లేదు అంటూ బలంగా కూర్చుకున్నారు. ఇప్పుడు ఆయన గతంలో ప్రకటించిన సినిమాను తెరకెక్కించడానికి డబ్బులు కోసం క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని ఆశ్రయించారు. ఆ సినిమా పేరు ‘మర్మాణువు’.
ఈ పేరు వింటుంటే ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా.. అవును మనకు గతంలో వినిపించిన పేరే ఇది. రాజశేఖర్ హీరోగా, వారి కుటుంబ సభ్యులు నిర్మాతగా ఈ సినిమాను గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్‌కి వచ్చింది. మూడేళ్లుగా ఈ సినిమాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నానని, సంప్రదాయ పద్ధతుల్లో సినిమా తీయలేనని గ్రహించానని, అందుకే ఈ విధానంలోకి వచ్చానని వెంకటేశ్ మహా (Venkatesh Maha) తెలిపారు.
‘మర్మాణువు’ సినిమా డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అని, దీనికి రూ.6.5 కోట్లు బడ్జెట్ కావాలని పేర్కొన్నారు. అయితే ఇది వాస్తవ బడ్జెట్ లో సగం మాత్రమే అని అన్నారు. దీని కోసం సెప్టెంబర్ 7న www.marmaanuvu.com అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనికేషన్ కోసం నాకు [email protected]కి ఈమెయిల్ చేయొచ్చు అని చెప్పారు.