వెంకీ అట్లూరి (Venky Atluri) నటుడిగా, రైటర్ గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ‘స్నేహగీతం’ అతని డెబ్యూ మూవీ. ఆ సినిమాకి డైలాగ్స్ కూడా అందించాడు. ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ కి కూడా డైలాగ్స్ అందించాడు. ‘కేరింత’ సినిమాకి కథ, డైలాగ్స్ అందించడం కూడా జరిగింది. ఇక వరుణ్ తేజ్ తో (Varun Tej) చేసిన ‘తొలిప్రేమ’ (Tholi Prema) తో వెంకీ అట్లూరి దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu) పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘రంగ్ దే’ (Rang De) కి పాజిటివ్ టాక్ వచ్చినా..
బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ‘రంగ్ దే’ సినిమా వల్ల వెంకీ అట్లూరి రొటీన్ లవ్ స్టోరీస్ చేస్తున్నాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ధనుష్ (Dhanush) తో ‘సార్’ (Sir) అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఎన్నో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ‘వెంకీ అటు తిప్పి.. ఇటు తిప్పి ప్రేమకథే చేస్తాడు’ అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ కట్ చేస్తే..
‘సార్’ చిత్రం వెంకీ చేసిన మొదటి 3 సినిమాలకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కూడా..! అందుకే అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే సినిమా అనౌన్స్ చేశాడు.టైటిల్ ని బట్టి మళ్ళీ లవ్ స్టోరీ తీస్తాడేమో అని కొందరు అభిప్రాయపడ్డారు. టీజర్ రిలీజ్ అయ్యే వరకు అంతా అలాగే అనుకున్నారు.
కానీ టీజర్, ట్రైలర్స్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ విడుదల తర్వాత మరింత మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా వెంకీ అట్లూరి రైటింగ్ కి అంతా ఇంప్రెస్ అయ్యారు. ఇక అతను పూర్తిగా ప్రేమ కథల నుండి బయటపడినట్టే అనే పాజిటివ్ కామెంట్స్ కూడా మొదలయ్యాయి.