చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్న వైవీఎస్ చౌదరి… ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వైవీఎస్ చౌదరి.. తన కొత్త సినిమా గురించి చెబుతూనే.. కరోనా పరిస్థితులు, సినిమా పరిశ్రమపై కరోనా ప్రభావం, ప్రజల స్థితిగతుల గురించి ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ఆయన పొలిటికల్ కామెంట్స్ కొన్ని చేశారు. ఇప్పుడవి చర్చకు దారితీశాయి. వైవీఎస్ చౌదరి సినిమాలు చాలాపవర్‌ఫుల్‌గా ఉంటాయి.
డైలాగ్‌ల విషయంలో ఆయన ఇంకా పవర్‌ఫుల్‌గా చూసుకుంటారు. తాజాగా పొలిటికల్ అంశంపై చేసిన కామెంట్లు కూడా అలానే వినిపించాయి. కరోనా పరిస్థితుల గురించి మాట్లాడుతూ ‘‘ప్రజల దుస్థితికి ముందుచూపు లేకపోవడమే కారణం. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా ఏ ఒక్కరినో నిందించలేం. కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉద్ధృతంగా ఉంటుందని తెలియదు. ఒకవేళ ఇంత ఉద్ధృతంగా లేకపోయుంటే.. ‘మనది కర్మ భూమి, అందుకే మనకు సెకండ్ వేవ్ రాలేదు’ అని స్టేట్‌మెంట్లు వచ్చుండేవి అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
దాంతోపాటు అధికారం, పరిపాలన గురించి కూడా మాట్లాడారు. ‘‘కరోనా విషయంలో అనుకున్నట్లు జరగలేదు కాబట్టి.. ముందే సెకండ్ వేవ్ గురించి ఎందుకు హెచ్చరించలేదని అడిగే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మనం పరిపాలనను ఒకరి చేతుల్లో పెట్టాం. కాబట్టి ప్రస్తుత పర్యావసానాలన్నింటికీ వాళ్లే బాధ్యత వహించాలి’’ అని అన్నారు వైవీఎస్. కరోనా విషయంలో ప్రభుత్వాల తప్పొప్పుల గురించి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ సమయంలో మొత్తం కరోనా నష్టం, కష్టం ప్రభుత్వం మీదే నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైవీఎస్ చౌదరినే చెప్పాలి. అన్నట్లు ఆయన ఏ పార్టీకి చెందినవ్యక్తి కాదు అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.