తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒకరు ప్రేమ కథలతో హృదయాలను మీటితే .. మరొకరు కుటుంబ కథలతో కన్నీరు తెప్పిస్తారు. కొందరు భారీ ఫైట్స్ తో మాస్ ని అలరిస్తే .. మరికొందరు పదునైన మాటలతో క్లాస్ ని ఆకట్టుకుంటారు. టేకింగ్ లో ఎవరికీ వారే సాటి అని నిరూపించుకున్నారు. ఏ బాటలో నడిచినా వీరందరి లక్ష్యం థియేటర్ కి వచ్చిన వారిని ఎంటర్టైన్ చేయడమే.
కథే హీరో
తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాన్ని ప్రపంచానికి చాటిన డైరక్టర్ రాజమౌళి. చిన్నా, పెద్దా, మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరికీ నచ్చేలా సినిమా తీయడంలో జక్కన్న దిట్ట. అతని సినిమాలో కథే హీరోగా ఉంటుంది. అందుకే అతని సినిమాలో స్టార్లు కనిపించరు. పాత్రలే గుర్తుంటారు. టెక్నికల్ గా అప్డేట్ అవుతూ వాటిని ఎంతమేర కథలో మేళవించాలో తెలిసిన ప్రతిభావంతుడు. అన్ని క్రాఫ్టుల్లో పట్టు ఉన్న పనిమంతుడు. అపజయం ఎరుగని ఈ మగ ధీరుడు తెలుగు టాప్ డైరెక్టర్ గా నిలిచాడు.
పెన్ తో పంచ్ లు
నిజ జీవితాలను కమర్షియల్ రేంజ్ ని తీసుకెళ్లిన ఘనుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఉమ్మడి కుటుంబం.. అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని, అన్న, చెల్లి .. వీరేఅతనికి ప్రధాన పాత్రలు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిరు గొడవలే .. సినిమాలో కష్టాలు. ఇటువంటి కథలతో భారీ హిట్లు రాబట్టిన అతడు త్రివిక్రమ్. నీచ కామెడీనిదరిదాపులకు కూడా రానీయకుండా ఫ్యామిలీ తో కలిసి హాయిగా నవ్వుకునేలా మాటలు రాస్తారు. “గన్ ని చూడాలని అనుకో తప్పు లేదు .. బులెట్ ని చూడాలనుకోకు”.. “నేను సింహం లాంటి వాణ్ని.. అది గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటా .. అంతే తేడా . మిగతాదంతా సేమ్ టు సేమ్” .. వంటి పంచ్ లు వేసి తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నారు. తాజాగా “అ..ఆ” సినిమాతో తన పెన్ పవర్ ను త్రివిక్రమ్ చూపించాడు.
ముక్కు సూటిగా ..
కలాన్ని నమ్ముకున్న మరో దర్శకుడు పూరి జగన్నాథ్. తను డైరక్ట్ చేసే సినిమాలకు కథ, మాటలు సొంతంగా రాసుకుంటారు. పూరి డైలాగులు చాలా ఈజీగా మాస్ప్రజలకు చేరువవుతాయి. “చంటిగాడు.. లోకల్..”.. “నువ్వు నందా అయితే .. నేను బద్రి నాథ్”.. “ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”.. వంటివిపాపులర్ అయ్యాయి. నేటి యువత పల్స్ తెలిసిన దర్శకుడు పూరి. మెలో డ్రామా కు చోటివ్వకుండా.. విషయాన్ని సూటిగా చెబుతూ .. కథను వేగంగా నడిపిస్తారు.సినిమా నిర్మాణంలో కూడా ఈ వేగం కనిపిస్తుంది.
పగ, ప్రతీకారం, మధ్యలో ప్రేమ
సీరియస్ కథలకు కామెడీ కోటింగ్ ఇచ్చి హిట్ అందుకునే డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇతని సినిమాలోని కామెడి ట్రాక్ కోసం అభిమానులు క్యూ కడుతుంటారు. పగ, ప్రతీకారం,మధ్యలో ప్రేమ అనే సూత్రం తో ఇతని సినిమాలు నడుస్తాయి. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ శ్రీను వైట్ల మెప్పిస్తుంటాడు.
యాక్షనే బలం
మాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే డైరెక్టర్ వీవీ వినాయక్. భారీ ఫైట్లు ఇష్టపడే వారికి ఇతని సినిమాలు భలే నచ్చుతాయి. యాక్షన్ సన్నివేశాలు రిచ్ గా తీయడంలో వినాయక్ దిట్ట. అదే ఆయన బలం. స్టార్ల ఇమేజ్ ని అమాంతం పెంచడంలో వీవీ వినాయక్ సిద్ధహస్తుడు.
దమ్మున్న డైరెక్టర్
భద్ర, తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు .. వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు బోయపాటి శీను. ఇతని ప్రతి సినిమాలో దమ్మున్నకథ ఉంటుంది. ఓ వైపు రక్త పాతాలు సృష్టిస్తూనే.. మరో వైపు మహిళలను కదిలించే సన్నివేశాలను అద్భుతంగా తీయగలడు. అందుకే స్టార్ హీరో లు బోయపాటితో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.
మెదడుకి పదును
పూర్వంలో లెక్కల మాస్టారుగా చేసిన సుకుమార్ సినిమాలు కూడా లెక్కల పుస్తకంలా అనిపిస్తాయి. అర్ధం చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటాయి. ప్రతి షాట్ వెనుక ఏదో మర్మం ఉంటుంది. సుకుమార్ చిత్రాలు మాస్ ప్రేక్షకులకు చేరుకోక పోయినా.. క్లాస్ ఆడియన్స్ కి కిక్ ఇస్తాయి. హీరోని డిఫరెంట్ గా చూపించడంలో నేర్పరి.
సందేశంతో కూడిన హిట్
సందేసాత్మక చిత్రాలు పేరు తెచ్చుకుంటాయి. కానీ ఆర్థికంగా నష్ట పోతాయి. కమర్షియల్ చిత్రాలు కాసులు కురిపించినా కొంతకాలమే గుర్తుంటాయి. ఈ రెండు అంశాలను మేళవించి సినిమాను తీసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. రచయితగా పరిచయమై డైరక్టర్ గా ఎదిగిన ప్రతిభావంతుడు ఈయన. దర్శకుడిగా పనిచేసింది రెండు సినిమాలకే అయినా తెలుగు టాప్ డైరక్టర్ల జాబితాలో చేరిపోయాడు. అతను తీసిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలు పేరుతో పాటు కలక్షన్లను రాబట్టాయి.
సమాజమే స్ఫూర్తి
సమాజంలోని వ్యక్తులనే స్ఫూర్తి గా తీసుకుని హీరోలను మలుస్తుంటారు క్రిష్ . గమ్యం, వేదం, కంచె సినిమాల్లో సమాజంలోని పరిస్థుతులను క్రిష్ కళ్ళకు కట్టారు. సున్నితమైన కథలను మరింత సుకుమారంగా చెప్పి విజయాలను అందుకున్నారు.
కుటుంబం పై ఫోకస్
వ్యక్తులు తమ భాద్యతలు నెరవేరిస్తే కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉంటే సమాజం చక్కగా ఉంటుంది. ఈ అంశాలే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి కథా వస్తువులు. కుటుంబం పై ఫోకస్ పెట్టి చిత్రాలు తీస్తుంటారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల ద్వారా కుటుంబాల్లోని అనుబంధాలను చూపించారు.