కీరవాణి తనయుడు శ్రీసింహ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం “దొంగలున్నారు”. “4X4” అనే హాలీవుడ్ చిత్రం రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఇవాళ ఉన్నపళంగా విడుదలయింది. మొదటి చిత్రంతో విజయాన్ని అందుకొని రెండో సినిమాతో చతికిలపడిన శ్రీసింహ.. మూడో సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడా లేదో చూద్దాం..!!
కథ: చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ టైం పాస్ చేసే కుర్రాడు రాజు (శ్రీసింహ). ఓ కాస్ట్లీ కార్ దొంగతనం చేయడానికి ప్రయత్నించి.. అందులో ఇరుక్కుపోతాడు. బులెట్ ప్రూఫ్ కార్ కావడంతో.. రాజు ఎంత కష్టపడినా ఆ కార్ నుంచి బయటపడలేకపోతాడు. ఒకానొక సందర్భంలో తన ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. అయితే..
ఆ కార్ లో తాను లాక్ అవ్వడానికి కారణం ఓ డాక్టర్ అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఆ డాక్టర్ ఎవరు? రాజును ఎందుకు కారులో లాక్ చేస్తాడు? చివరికి రాజు ఆ కారు నుండి ఎలా బయటపడ్డాడు? అనేది “దొంగలున్నారు జాగ్రత్త” కథాంశం.
నటీనటుల పనితీరు: అప్పుడప్పుడు కనిపించే సముద్రఖని పక్కన. పెడితే.. సినిమా మొత్తం శ్రీసింహనే కనిపిస్తాడు. సరదా సన్నివేశాల్లో పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. ఎక్కడైనా కోపం, నిస్సహాయత ప్రదర్శించాల్సివచ్చినప్పుడు మాత్రం తేలిపోయాడు. సినిమా మొత్తం తన మీదే ఆధారపడి ఉంది, సినిమాను మోయాల్సిన బాధ్యత ఉంది అని తెలిసినప్పుడు క్యారెక్టర్ పై ఇంకాస్త హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. పాత్రను ఓన్ చేసుకొని, సదరు పాత్రలో జీవించాలి. శ్రీసింహ నటుడిగా ఇంకా ఎదగాల్సి ఉందని ప్రూవ్ చేసిన సినిమా ఇది.
సాంకేతికవర్గం పనితీరు: కాలభైరవ సంగీతం మినహా సినిమాలో ప్లస్ పాయింట్ గా చెప్పగలిగే సాంకేతికవర్గపు పనితనం ఒక్కటీ లేకపోవడం గమనార్హం, ఈ తరహా చిత్రానికి చాలా ముఖ్యమైన సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సోసోగా ఉండడం సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎంతో థ్రిల్ కు గురి చేయాల్సిన సౌండ్ డిజైన్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా వర్కవుటవ్వలేదు.
దర్శకుడు హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం వరకు బానే ఉంది కానీ.. ఇండియన్ నేటివిటీకి తగ్గట్లుగా ఆ కథలో మార్పులు చేయడంలో కానీ.. తెరకెక్కించడంలో కానీ జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడలేని బోర్ ఫీలవుతారు. 90 నిమిషాల సినిమా కూడా ఆడియన్స్ బోర్ ఫీలయ్యారంటే.. కచ్చితంగా దర్శకుడి వైఫల్యమనే చెప్పాలి.
విశ్లేషణ: యువకథానాయకుడు శ్రీసింహ ఈ కథను ఎంపిక చేసుకోవడంలో చూపిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ.. సినిమాను తెరకెక్కించిన విధానం, 90 నిమిషాల నిడివిని భరించాలంటే మాత్రం బోలెడంత ఓపిక కావాలి.