శంకర్ -రామ్‌చరణ్ – దిల్ రాజు… సినిమా గురించి అఫీషియల్‌గా ఏవైనా వివరాలు ప్రకటించేస్తే బాగుండు. పెద్ద సినిమా కదా… ఎవరికివారు రకరకాల కథలు అల్లేసి సినిమా గురించి నమ్మేయాలి అనిపించేలా రాసుకొచ్చేస్తున్నారు. అందులో కొన్ని ఆసక్తికరంగా, నిజమైతే బాగుండు అనేలా ఉన్నాయి. ఇటీవల రామ్‌చరణ్ -శంకర్ – దిల్ రాజు కలిసినప్పుడు ఈ పాయింట్లే చర్చకు వచ్చాయంటున్నారు. రామ్‌చరణ్ కోసం శంకర్ సామాజిక బాధ్యతను తెలిపే… రాజకీయ కథ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
ఇది పాత మాటే. అయితే ఇందులో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇది పక్కన పెడితే… కలెక్టర్‌గా పని చేసే ఓ వ్యక్తి సమాజంలో పరిస్థితులు నచ్చక రాజకీయాల్లోకి వచ్చి మార్చాలి అనుకుంటారట. అంటే చరణ్ కలెక్టర్‌గా, సీఎంగా కనిపిస్తాడు అని ఈ పుకార్ల అర్థం. వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఆఖరిది ‘అయితే అంతకుమించి మనకేం కావాలి’ అనిపించేది ఒకటి ఉంది. అదే ఈ సినిమాలో చిరంజీవి ఓ అతిథి పాత్రలో మెరవబోతున్నారట.
సినిమాలో కీలక సమయంలో చిరంజీవి వచ్చి కనిపిస్తారని అంటున్నారు. సినిమా ఇంకా ప్రాథమిక దశ కూడా మొదలు కాకుండానే ‘చిరంజీవి పుకారు’ను నమ్మలేం. కానీ జరిగితే బాగుండు అనిపిస్తోంది కాబట్టి. అభిమానులూ… గట్టిగా అనేసుకొండి మరి.