పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజి’ (OG Movie) సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్ గురించి ఎప్పటి నుంచో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి. మేలో రిలీజ్ కావాల్సిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఇంకా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ‘ఓజి’ సెప్టెంబర్ 5న విడుదలవుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, దానిపై ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు.
2025లో రిలీజ్ డేట్ ఖరారైతే అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు, కానీ ఆ అప్డేట్ కూడా లేదు. తాజాగా, ‘ఓజి’లో విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi ) ‘గ్రౌండ్ జీరో’ ప్రమోషన్స్‌లో ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌తో తన కాంబినేషన్ సీన్స్ ఇప్పటివరకు ఒక్కటి కూడా షూట్ చేయలేదని, కేవలం తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే సుజిత్ పూర్తి చేశాడని చెప్పాడు. ఇంకో నెల లేదా రెండు నెలల్లో షూటింగ్ కోసం పిలుపు రావచ్చని ఇమ్రాన్ వెల్లడించాడు.
ఇంత కీలకమైన పాత్రతో సీన్స్ ఇంకా మొదలు కాకపోతే, షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్-ప్రొడక్షన్, సెన్సార్, ప్రమోషన్స్ వంటివి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇమ్రాన్ పాత్ర చిన్నదైతే ఎక్కువ డేట్స్ అవసరం లేదనుకోవచ్చు, అయితే ఇది ఆషామాషీ రోల్ కాదని స్పష్టం. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ (S.S.Thaman) సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
నిర్మాత దానయ్య, దర్శకుడు సుజిత్ 2025లోనే ‘ఓజి’ని విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం దానికి అడ్డుగా మారుతోంది. ‘ఓజి’ ముంబైలోని మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్. ఓజస్ గంభీర అనే రుష్‌లెస్ డాన్‌గా పవన్ కళ్యాణ్, అతని శత్రువుగా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. 2025లో విడుదల అవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.