‘దేవుడా ఓ మంచి దేవుడా..’ ఈ కామెడీ ట్రాక్ మీకు గుర్తుందా? అసలు ఈ సీన్ గుర్తుండని తెలుగు ప్రేక్షకుడే ఉండరు అంటారా? ఆ మాట అన్నారు అంటే మీరు చాలాసార్లే చూసుంటారు ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) సినిమాని. రచయిత త్రివిక్రమ్ (Trivikram), దర్శకుడు విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) ఆ సినిమాలో పెట్టిన ఆ సీన్ అంతలా పేలింది. వెంకటేశ్ (Venkatesh) అయితే ఇరగదీశాడు ఆ సీన్‌లో కామెడీ. ఇప్పటికీ యూట్యూబ్ ఫీడ్‌లోనే, ఫేస్‌బుక్ వాచ్‌లోనే కనిపిస్తే కాసేపు స్క్రోలింగ్ ఆపి చూస్తుంటాం.
Nuvvu Naaku Nachav
ఎవరైనా ఫ్రెండ్ కవిత రాశా, పాట రాశా అని ఆ రోజుల్లో అంటే ఠక్ మని ఆ సినిమా సీన్ గుర్తొస్తుంది. వెంకీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ భలే కుదిరాయి. వాటికి ఎమ్మెస్ నారాయణ (M. S. Narayana) ఛమక్కులు అయితే మరింత అందాన్ని తెచ్చాయి. ఇంత గొప్పగా చెబుతున్న సీన్ మనది కాదు అని అంటే నమ్ముతారా? నిజమే.. ఆ సీన్ త్రివిక్రమ్ ఆలోచనల నుండి వచ్చింది కాదు. ఓ ఇంగ్లిష్ సినిమా నుండి ఆ సీన్ తీసుకున్నారు.
‘మీట్ ది పేరెంట్స్’ అంటూ 2000 సంవత్సరం సమయంలో ఓ ఇంగ్లిష్ సినిమా వచ్చింది. అందులో ‘దేవుడా ఓ మంచి దేవుడా’ అంటూ నటుడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఓ పద్యం చెబుతాడు. అచ్చంగా ఆ సీన్‌నే త్రివిక్రమ్ తస్కరించారు. దానికి మన నేటివిటీ కాస్త తగిలించి సినిమాలో పెట్టేశారు.
ఏమైందో ఏమో కానీ ఎనిమిదేళ్ల క్రితం ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) వచ్చినప్పుడు ఈ సీన్ బయటకు వచ్చింది. తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ సీన్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు బాగా ఉండేవాళ్లయితే మీకు ఈ పాటికే ఫీడ్‌లో వచ్చేసి ఉంటుంది. లేదంటే ఓసారి వెతికి చూడండి ఆ సీన్ కనిపిస్తుంది. తెలుగుకు సమానంగా ఆ సీన్‌లో ఫన్ కనిపిస్తుంది.