నటి మాధవీలత (Maadhavi Latha) – టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)కి ఫిర్యాదు చేసింది. మా ట్రెజరర్ శివ బాలాజీకి (Siva Balaji) ఫిర్యాదు ఇచ్చింది. సినిమాల్లో నటిస్తున్న మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత ఫిర్యాదులో పేర్కొంది.
Maadhavi Latha
జేసీ ప్రభాకర్ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని, ఇలాంటి పనులు చేస్తే ప్రజలు హర్షించరని మాధవీలత అన్నారు. అయితే మాధవీలత గురించి ఆవేశంలో మాట్లాడేశానని, తనకు మహిళలంటే గౌరవమని జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరారు కూడా. కానీ ఇప్పుడు మాధవీలత ‘మా’కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుండి ఎవరూ ఖండించలేదని.. హెచ్‌ఆర్సీ, పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని మాధవీలత చెప్పారు. అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. సినిమా వాళ్లపై ఆరోపణలు, దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని శివబాలాజీ సూచించారు. రాజకీయ నాయకలు ప్రజల సమస్యలను పరిష్కరించాలి కోరారు.
కొత్త సంవత్సరం సందర్భంగా తాడిపత్రిలో మహిళలకు మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఈవెంట్‌కి మహిళలు వెళ్లొద్దని మాధవీలత ఓ వీడియోని రిలీజ్ చేశారు. జేసీ పార్కులో గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, మీపై దాడులు చేస్తే ఎవరిది బాధ్యత? అని మాధవీలత అన్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షూటింగ్స్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేశావు, నీ సంగతి మాకు తెలుసు అంటూ కామెంట్లు చేశారు.