Fahadh Faasil: తొలి సినిమాతో దారుణమైన ఫీడ్‌బ్యాక్‌.. ఫహాద్‌ను మార్చిన సినిమా అదే..!

  • December 2, 2024 / 05:39 PM IST

స్టార్‌ దర్శకుడి తనయుడు.. చూడటానికి బాగానే ఉన్నాడు. ఇంకేముంది ఓ హిట్‌ కొట్టగానే స్టార్‌ అయిపోతాడు అని అనుకున్నారు అతని అరంగేట్రం సమయంలో. కానీ అనుకున్నట్లుగా అన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. అందుకేనేమో ఆయన అనుకున్నట్లు జరగలేదు. సినిమా కావడం పక్కనపెడితే ‘నటన రాదు’ అంటూ పెద్ద ఎత్తున హేళన ఎదుర్కొన్నాడు. అతనే భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అలియాస్‌ ఫహాద్‌ ఫాజిల్‌  (Fahadh Faasil) . నాగార్జునతో (Nagarjuna) ‘కిల్లర్‌’ అనే సినిమా తీసిన దర్శకుడు ఫాజిల్‌ తనయుడే ఫహాద్‌ ఫాజిల్.

Fahadh Faasil

‘పుష్ప: ది రైజ్‌’  (Pushpa)  సినిమాతో తెలుగు వాళ్లకు బాగా పరిచయమైపోయాడు. ఆ తర్వాత మాలీవుడ్‌లో సోలో హీరోగా మంచి విజయాలు కూడా అందుకున్నాడు. అయితే తొలి సినిమా అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు వెర్సటైల్‌ యాక్టర్‌ అని పొగుడుతున్న సీనియర్‌ నోళ్లు.. అప్పుడు నటన రాదు అని అన్నాయి.అయితే అతని జీవితాన్ని మార్చింది మాత్రం ‘యు హోతా తో క్యా హోతా’ అనే సినిమా. అదేంటి అందులో ఫహాద్‌ నటించలేదు కదా అంటారా?

అవును నటించలేదు కానీ ఆయన జీవితంలో ఆ సినిమా చాలా కీలకం. 9/11 దాడుల్లో మరణించిన ఆరుగురి జీవితాల ఆధారంగా తెరకెక్కించిన ఆ సినిమా చూశాక చిన్నకారణాలకే అనుకున్న పనిని మధ్యలోనే ఆపేయడం కరెక్ట్‌ కాదనిపించిందట ఫహాద్‌కి. అందుకే సినిమాలకు దూరంగా అమెరికా వెళ్లిపోయిన ఫహాద్‌ (Fahadh Faasil) భారత్‌కి తిరిగి వచ్చాడు. ఫహాద్‌ నటించిన తొలి చిత్రం ‘కైయెట్టుమ్‌ దూరట్టు’. 2002లో ఈ సినిమా వచ్చింది.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. దీంతో ఫాజిల్‌ కొడుక్కి నటన రాదనీ, బొమ్మలా ఉన్నాడనీ, హీరోగా పనికిరాడనీ విమర్శలు వచ్చాయి. అయితే 2006లో ‘యు హోతా తో క్యా హోతా’ సినిమా చూసి చదువు మధ్యలో మానేసి నటనలో శిక్షణ తీసుకుని ఏడేళ్ల తరవాత ఇండియా వచ్చాడు. మొదటి రెండేళ్లు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే చేశాడు.

ఆ తర్వాత ‘చప్పాఖురిష్‌’, ‘డైమండ్‌ నెక్లెస్‌’, ‘22 ఫిమేల్‌ కొట్టాయం’, ‘మహేషింటే ప్రతీకారం’, ‘కుంబలంగి నైట్స్‌’, ‘సూపర్‌ డీలక్స్‌’, ‘ట్రాన్స్‌’, ‘సీ యూ సూన్‌’, ‘జోజి’, ‘మాలిక్‌’, ‘ధూమం’, ‘ఆవేశం’ మంచి పేరు తీసుకొచ్చాయి. ‘మామన్నన్‌’ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డా అని చెప్పాడు ఫహాద్‌. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుండీ కుక్కలంటే ఇష్టం. కానీ ఆ సినిమాలో కుక్కల్ని క్రూరంగా చంపే పాత్ర చేశాడు.

రిటైర్మెంట్ ప్రకటించిన కుర్ర హీరో… ఎందుకో చెప్పకుండా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus