ఈ మధ్యకాలంలో మన మేకర్లు పక్క రాష్ట్రాల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. వారికి భారీ రెమ్యునరేషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి పక్క భాషల వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వేరే భాషలకు చెందిన నటులు సినిమాలో ఉంటే శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా అప్పీల్ వస్తుంది. అందుకే నిర్మాతలు కూడా భారీ రెమ్యునరేషన్ లు ఇచ్చి మరీ పరభాషా నటులను తీసుకొస్తున్నారు.
తాజాగా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను తీసుకున్నారు. మలయాళంలో స్టార్ స్టేటస్ అందుకున్న ఫహద్ కు తెలుగునాట కూడా అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన ‘ట్రాన్స్’ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటన చూసి తెలుగువారు కూడా ఫిదా అయ్యారు. నటుడిగా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. ఇంతటి క్రేజ్ ఉన్న స్టార్ ని ‘పుష్ప’లో తీసుకోవడంతో ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయింది. అయితే ఫహద్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం మొత్తం ఆయనకి రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ప్లస్ జీఎస్టీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలకు కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వరు. అయితే మలయాళంలో ఆయనకున్న క్రేజ్ ని బట్టి చూసుకుంటే ఇది చాలా తక్కువ మొత్తమని అంటున్నారు. ఫహద్ ఫాజిల్ కి ఉన్న డిమాండ్ ని బట్టి చూసుకుంటే ‘పుష్ప’ సినిమాకి మలయాళ మార్కెట్ లో మంచి రేటు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.