సినిమాను రెండు ముక్కలు చేయడం, సినిమా తర్వాత సీక్వెల్ చేయడం… అంత ఈజీ కాదు. అయితే ‘బాహుబలి’ వచ్చాక ఇదేదో బాగుందే అనుకున్నారు. ‘కేజీయఫ్’ వచ్చాక ఒహో మొదలెట్టారా అనుకున్నారు. ‘పుష్ప’ రెండు పార్టులు చేశాక మొదలెట్టేశార్రోయ్ అనుకున్నారు. ఈ మేనియా వల్లనేమో ‘ఆర్‌ఆర్‌ఆర్’కి కూడా రెండు పార్టులు ఉంటాయా అనే ప్రశ్న మొదలైంది. మొన్నీ మధ్య సినిమా ప్రచారంలో సీక్వెల్ ప్రశ్న తెగ వినిపించింది. దర్శకుడు రాజమౌళి అయితే, ఇది ఒక్క పార్టే అని తేల్చేశారు. కానీ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు.
అవును, ‘ఆర్‌ఆర్‌ఆర్’చూసిన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆలోచనలు ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌పైనే ఉన్నాయి. రెండో పార్టు అయినా తీయండి, లేదంటే ఈ కాంబోతో మరో సినిమా అయినా తీయండి అని అడుగుతున్నారు. అయితే దీనికి రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి ప్రభాస్, రానాను పెట్టుకుని ‘బాహుబలి’ని రెండు పార్టులుగా తీసిన రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి ఇద్దరి స్టార్ హీరోలని పెట్టుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒక్క సినిమాగా చేయడమేంటి అని అడుగుతున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ క్లయిమాక్స్‌ను అంత త్వరగా, ఫోర్స్డ్‌గా ముగించడం ఎందుకు, రెండో పార్టుకు తీసుకెళ్లొచ్చు కదా అని కొందరు ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరికొందరు అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను చూడడానికి మూడు గంటలు సరిపోలేదు, మాకు ఇంకా కావాలి. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పార్ట్ 2 తీయండి అని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి రిక్వెస్ట్‌లు చాలానే కనిపిస్తున్నాయి. ఈ మాటలు ముందే ఊహించేశారేమో రాజమౌళి… ‘ఆర్‌ఆర్‌ఆర్’కి సీక్వెల్ అవకాశమే లేదని చెప్పేశారు.
ఈ కథను ఒక్క సినిమాగానే చేయగలం అని తేల్చి చెప్పేశారు. చెప్పాలనుకున్న విషయం ఒక్క పార్ట్‌లో అయిపోయినప్పుడు సీక్వెల్ లేదా పార్ట్ 2 అవసరం లేదు అనేది ఆయన మాటల్లో ఆంతర్యం. అయితే అభిమానులకు తమ అభిమాన కథానాయకుడిని ఇంకొంచెం సేపు రాజమౌళి ఫ్రేమ్‌లో చూడాలని ఉండటం సహజం. సో ఈ ఇద్దరి హీరోలతో రాజమౌళి మరో సినిమా ప్లాన్ చేయాల్సిందే అంటున్నారు. అయితే రాజమౌళి క్యాలెండర్ చాలా బిజీగా ఉంది.
మహేష్‌బాబు సినిమా చేయాలి నెక్స్ట్. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తారని టాక్. ఇది కాకుండా ఓ బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ యానిమేషన్ మూవీ కూడా లైన్‌లో ఉన్నాయిం. సో ఫ్యాన్స్ ఇంత త్వరగా మీ కోరిక నెరవేరడం కష్టమే.