ఇండియన్ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా కోసం కొన్ని సన్నివేశాలను రూపొందించడం, పాటలను సిద్ధం చేయడం లాంటివి మనం చూశాం. మొన్నామధ్య ఓ సినిమా క్లైమాక్స్‌ను కూడా మార్చేశారు. ఓ సినిమా కోసం ట్రైలర్‌ను సిద్ధం చేసి రిలీజ్ చేశారు అని కూడా చూశాం. కానీ ఇప్పుడు హాలీవుడ్‌లో ఏకంగా ఓ హీరోయిన్‌నే రూపొందించారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఓ టెక్ సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించొచ్చు అని టెక్నాలజీ నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. అయితే మంచికి వాడాల్సిన ఏఐని చెడుకు వాడి ఇబ్బందులు పెడుతున్న వారున్నారు. ఇలాంటి సమయంలో ఏఐతో ఓ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోంది ఓ హాలీవుడ్ సంస్థ. లండన్‌కి చెందిన ఏఐ ప్రొడక్షన్స్ కంపెనీ పార్టికల్ 6.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో టిల్లీ నార్వుడ్ అనే ఏఐ యాక్టర్‌ను పరిచయం చేసింది. ఆ నటితో హాలీవుడ్ సినిమాల్లో సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఏజెంట్లతో చర్చలు ప్రారంభించింది.
ఈ మేరకు ఏఐ యాక్టర్ టాలెంట్ తెలిపేలా డెమో వీడియోలూ రూపొందించి మరీ బయటకు రిలీజ్ చేసింది. పార్టికల్ 6 సంస్థ ప్లానింగ్ వర్కౌటైతే ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్ స్టార్‌గా టిల్లీ నిలుస్తుంది. మరి ఎవరు టిల్లీని సినిమాల్లోకి తీసుకుంటారు అనేది చూడాలి. ఇదిలా ఉండగా హాలీవుడ్ నటుల నుండి మాత్రం ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి డిజిటల్ యాక్టర్ల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై పార్టికల్ 6 సంస్థ కూడా స్పందించింది. టిల్లీ తమ సృజనాత్మకత నుండి వచ్చిన ప్రొడక్ట్ మాత్రమేనని, నటులకు అది ప్రత్యామ్నాయం కాదని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఏఐ తరహా నటులు/ పాత్రల సృష్టి యానిమేషన్ లాంటిదేనని ఈ సందర్భంగా సంస్థ గుర్తు చేసింది.