అందరూ అనుకున్నట్లే ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడింది. రాజమౌళి ఏకంగా ఆరు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేశాడు.ఈ చిత్రం 2020 జులై 30న విడుదల అవ్వాల్సి వుండగా, దానిని 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన అనంతరం వరుస అవరోధాలు ఎదురయ్యాయి. రాజమౌళి కుమారుడు వివాహం, రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడం, బాహుబలి చిత్ర లండన్ ప్రదర్శన ఇలా అనేక కారణాల వలన పలు మార్లు అనుకున్న ప్రకారం షూటింగ్ జరుగలేదు. దీనితో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఎప్పటి నుండో ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఐతే కొన్ని రోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ మూవీ యూనిట్, డెబ్భై శాతం షూటింగ్ పూర్తి చేశాం, అనుకున్న సమయానికి వస్తామని చెప్పి.. నెగెటివ్ ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వస్తుంది అని అనుకున్నారు.
ఇక ఎన్టీఆర్ కి 2019, 20 స్పెషల్ ఇయర్స్. ఈ రెండు సవంత్సరాలలో ఆయన నుండి ఒక్క చిత్రం కూడా రాలేదు.ఎన్టీఆర్ హీరోగా కెరీర్ మొదలుపెట్టిన నాటినుండి ఎప్పుడూ రెండేళ్ల విరామం తీసుకోలేదు. ఒక్క 2009లో మాత్రమే ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కెరీర్ ప్రారంభం నుండి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల చేయడం ఎన్టీఆర్ కి అలవాటు. అలాంటిది రాజమౌళి పుణ్యమా ఎన్టీఆర్ రెండేళ్లు ఒక్క సినిమా విడుదల చేయకుండా ముగించనున్నారు. సినిమా కోసం ఏళ్లకు ఏళ్ళు తీసుకున్నా.. అందుకు తగ్గ భారీ హిట్ ఇవ్వడం రాజమౌళికి అలవాటు.