టాలీవుడ్‌కి సంక్రాంతి ఎలాగో, కోలీవుడ్‌కి దీపావళి. సినిమాను బాగా ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా తెలుసు. అంతటి స్పెషల్ డే నాడు ఈ ఏడాది కోలీవుడ్‌లో మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ తెలుగులోకీ వస్తున్నాయి. దీంతో ఈ దీపావళికి టాలీవుడ్ కాస్త కోలీవుడ్ అయిపోతోంది. అయితే ఒక్క సినిమా స్ట్రెయిట్ సినిమా ఉంది. ఈ నేపథ్యంలో ఈ దీపావళికి టాలీవుడ్‌లో ఏయే సినిమాలొస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దాం. దీపావళికి సినిమాల సందడి ఈ ఏడాది అక్టోబరు 21 నుండి ప్రారంభమవుతోంది.
మొత్తం దీపాల పండగకు నాలుగు సినిమాలొస్తున్నాయి. ఆ రోజున కోలీవుడ్‌లో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ రెండింటిలో ఒకటి తమిళ సినిమా రీమేకే. దీంతో ఈ దీపావళి.. తమిళ దీపావళి అని సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 21న ఈ సినిమాలు వస్తున్నాయి. తమిళ సినిమాల సంగతి చూస్తే.. కార్తి – మిత్రన్ ‘సర్దార్’, శివకార్తికేయన్ – అనుదీప్ ‘ప్రిన్స్’ రాబోతున్నాయి.
ఇక తమిళంలో మంచి విజయం అందుకున్న ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’గా వస్తోంది. విశ్వక్ సేన్ – మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ నటస్తున్నారు. ఇక మిగిలిన సినిమా స్ట్రెయిట్ సినిమా. అదే మంచు విష్ణు ‘జిన్నా’. సూర్య అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్ ముఖ్య పాత్రధారులు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘ఫ్రెండ్‌షిప్’ అనే సాంగ్‌ను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించారు. దీంతో ఈ సినిమా మంచు కుటుంబానికి చాలా కీలకంగా మారింది. మరి ఈ దీపాల పండగకు టాలీవుడ్ టపాసు పేలుతుందా, లేక కోలీవుడ్ పటాసులు పేలుతాయా అనేది చూడాలి. ఏది హిట్ అయినా మనకు ఆనందమే. అయితే ఏది హిట్ అవుతుంది అనేది ఇక్కడ విషయం.