రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ (Game Changer) మొదటి రోజు భారీ వసూళ్లతో దూసుకెళ్లినప్పటికీ, రెండవ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రెండవ రోజు వెనకబడి ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకుల డేటా చెబుతోంది.
హైదరాబాద్‌లో 908 షోల కోసం కేవలం రూ. 2.4 కోట్ల మాత్రమే బుకింగ్స్ జరగడం ఆందోళనకరం. ఆక్యుపెన్సీ 24.5% మాత్రమే ఉండడం టాక్‌ను ప్రతిబింబిస్తోంది. బెంగళూరులో పరిస్థితి మరింత దిగజారినట్లుగా ఉంది, 703 షోల కోసం కేవలం 70 లక్షల బుకింగ్స్ రావడం, ఆక్యుపెన్సీ 10.1% మాత్రమే ఉండటం, నెగటివ్ టాక్ బాగా ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది.
విశాఖపట్నం మాత్రం కొంచెం బెటర్‌గా ఉందని చెప్పాలి. 253 షోల కోసం రూ. 73 లక్షల బుకింగ్స్ నమోదవ్వగా, 30% ఆక్యుపెన్సీ ఉంది. విజయవాడలో 169 షోల కోసం కేవలం రూ. 35 లక్షల బుకింగ్స్ మాత్రమే రాగా, 19.8% ఆక్యుపెన్సీ ఉందని తెలుస్తోంది. గుంటూరులో 42 షోలకుగాను రూ. 10 లక్షలు మాత్రమే నమోదు కావడం, ఆక్యుపెన్సీ 40.5% స్థాయిలో నిలవడం కొంత మెరుగైన పరిస్థితిని సూచిస్తోంది.
ఒంగోలు ప్రాంతంలో 33 షోలకుగాను కేవలం రూ. 8 లక్షల బుకింగ్స్ రావడం, ఆక్యుపెన్సీ 15.6% మాత్రమే ఉండటం, రెండు రోజులకే సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోతున్న సంకేతాలను ఇస్తోంది. తొలి రోజుతో పోలిస్తే ఈ స్థాయి తగ్గుదల, రెండవ రోజు కలెక్షన్లను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. సినిమా టీమ్ ప్రస్తుతానికి ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. బుకింగ్స్ డ్రాప్‌ను కాపాడుకోలేకపోతే, బాక్సాఫీస్‌పై తీవ్రంగా ప్రభావం పడవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.