‘మహాభారతం’ ఇతిహాసాన్ని సినిమాగా తీయాలని ఇండియన్ సినిమాలో చాలామంది ఆలోచనలు చేస్తున్నారు. ఒక్క సినిమానో, రెండు పార్టులతోనే ఇది పూర్తి కాదనే విషయం గ్రహించడమో, లేక కాస్టింగ్, షూటింగ్, ప్లానింగ్ అంత ఈజీగా కాదు అని అర్థమవ్వడమో కానీ.. ఇప్పటివరకు ఈ విషయంలో స్ట్రాంగ్‌గా అడుగులు పడటం లేదు. వీరిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్ లాంటివాళ్లు ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. అల్లు అరవింద్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉన్నారు అని తెలుస్తోంది. అర్జునుడి దృష్టి కోణంలో సినిమాను తెరకెక్కించాలని ఆయన ఆలోచన అని సమాచారం. ఆ పాత్రలో తన తనయుడు అల్లు అర్జునే చేస్తారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా ఈ విషయంలో అల్లు అరవింద్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేయిస్తుండగా.. అందులో కీలక ముందుడగు పడింది అని సమాచారం. అయితే ఈ సినిమాను హ్యాండిల్ చేసేది ఎవరు అనేది మాత్రం తేలడం లేదట.
మరోవైపు రాజమౌళి కూడా చాలా ఏళ్లుగా ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఆ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాస్తారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆమిర్ ఖాన్ అయితే త్వరలో ఈ పనులు మొదలుపెడతా అని అంటున్నారు. ఆయన ఏ పాత్ర చేస్తారు అనేది తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ కలిస్తే ఈ కలల ప్రాజెక్ట్ త్వరగా సెట్ అవుతుంది అనే ఓ వాదన ఇప్పుడు వినిపిస్తోంది. అలాగే బడ్జెట్ సమస్యలు కూడా రావు అని అంటున్నారు. ఇది జరగాలి అంటే.. ‘మగధీర’, ‘గజిని’ కాంబినేషన్లు తిరిగి రావాలి.
అల్లు అరవింద్ దగ్గర ఎంత టీమ్ ఉన్నా.. ఇలాంటి సినిమాల్ని హ్యాండిల్ చేయాలన్నా, ప్రమోట్ చేయాలన్నా రాజమౌళిని మించిన దర్శకుడు ఇంకొకరు దొరకరు. ఇంకొందరు ఉన్నా ఈ అదనపు ఆర్ట్‌లో ఆయన టాప్. మరి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. ఎవరు, ఎలా ముందుకొచ్చినా ఈ ప్రాజెక్ట్ ఓ దశాబ్దం నడుస్తుంది. ఈ సినిమాలు శతాబ్దంపాటు మాటల్లో ఉంటాయి.