విజయ్ దేవరకొండ గత చిత్రం అర్జున్ రెడ్డి దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు అతను చేసిన మూవీ గీత గోవిందం టార్గెట్ 10 కోట్లు ఏంటి? అని అడగాలని ఉంది కదూ. నిజమే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్థాయి పెరిగిపోయింది. అతని సినిమాల బడ్జెట్ పది కోట్లు దాటిపోయింది. అటువంటి సమయంలో 10 కోట్లు కలెక్ట్ చేయగలదా ? అనే ప్రశ్న అవసరమా.. అని కోపం తెచ్చుకోవద్దు. వివరాల్లోకి వెళితే … గీతా ఆర్ట్స్ వారు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సొంత హీరోలు అయినప్పటికీ వారి రేంజ్ కి తగ్గితే సినిమాలు నిర్మిస్తారు. విజయ్ దేవరకొండతో సినిమా అనుకున్నప్పుడు పదికోట్ల రూపాయలతోనే కంప్లీట్ చేయాలనుకున్నారు.
కానీ కథలో మార్పులు, కాస్టింగ్ లో మార్పులు, నిర్మాణ కాలం ఎక్కువ పట్టడం వంటి కారణాలు అన్నీకలిసి 14కోట్లు ఖర్చు అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్న సినిమా… క్రేజీ హీరోహీరోయిన్లు, ప్రచార వీడియోలకు వచ్చిన స్పందన బట్టి… శాటిలైట్, డిజిటల్ రైట్స్, ఓవర్సీస్ రూపంలో అయిదుకోట్లు నిర్మాతల చేతికి వచ్చాయి. ఇంకా తొమ్మిది కోట్లు వస్తే అసలు వచ్చేసినట్టే. ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయి లాభం కిందకి వస్తుంది. తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ 15 కోట్లు ఇవ్వడానికి కూడా డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నారు. అయినా సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేస్తున్నారు. మరి ఎంతమేర లాభాలను పంచనుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.