“మహానటి” సినిమా విడుదలయ్యాక.. సావిత్రిగారి పాత్ర, ఆమె వ్యవహారశైలి, దానగుణం, మొండితనానికి ఎంతమంది అభిమానులయ్యారో.. అదే స్థాయిలో జనాలు జెమిని గణేషన్ క్యారెక్టర్ కి, యాటిట్యూడ్ కి, ముఖ్యంగా సావిత్రిని మోసం చేసిన విధానానికి కోపం పెంచుకొన్నారు. ముఖ్యంగా సావిత్రి పతనమవుతున్న తరుణంలో ఆమెకు అండగా నిలవకపోవడం వంటి కారణంగా జెమిని గణేషన్ ను అసహ్యించుకొనే స్థాయిలో ప్రేక్షకులు వచ్చేశారు.
ఈ విషయమై జెమిని గణేషన్ ఏడుగురు కుమార్తెల్లో ఒకరైన కమల కాస్త సీరియస్ అయ్యారు. తమ తండ్రిని మరీ నీచుడిలా ప్రొజెక్ట్ చేశారని, ఆయన మరీ అంత దిగజారి ఎప్పుడు వ్యవహరించలేదని. సావిత్రి కోమాలోకి వెళ్ళిన అనంతరం పిల్లల బాధ్యత తీసుకోవడంతోపాటు ఆమె హాస్పిటల్ ఖర్చులు కూడా గణేషన్ చూసుకొన్నారని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ విషయాల్ని జెమిని గణేషన్ బయోపిక్ లో చూపించబోతున్నామని చెబుతున్నారు వారు. జెమిని గణేషన్ కుమార్తె కమల ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తారట. రేఖ నిర్మాణ భాగస్వాముల్లో ఒకరిగా వ్యవహరించే అవకాశం ఉందట.