ఘాజి

  • February 15, 2017 / 03:28 PM IST

రానా-తాప్సీ ముఖ్యపాత్రధారులుగా యువ రచయిత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఘాజి”. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందిన ఈ చిత్రం 1971లో విశాఖపట్నం సముద్ర సరిహద్దులో మునిగిపోయిన పాకిస్థానీ సబ్ మెరైన్ “ఘాజి” ఘటన నేపధ్యంలో తెరకెక్కింది. భారతీయులకే కాక కనీసం విశాఖపట్నం పౌరులకు కూడా తెలియని చాలా నిజాలు ఈ చిత్రం ద్వారా తెలుస్తాయని కథానాయకుడు రానా ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆ నిజాలేంటి? సదరు పాకిస్తాన్ సబ్ మరైన్ “ఘాజి” నేలమట్టం వెనుక నిజంగానే ఇండియన్ ఆర్మీ హస్తం ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మా సమీక్షను చదవాల్సిందే..!!

కథ : పాకిస్తాన్ నేవీ బేస్ భారత నౌకాదళంపై అప్రకటిత యుద్ధం చేయడానికి పూనుకుంటుంది. ఇండియన్ నేవీకి అత్యంత కీలకమైన “ఐ.ఎన్.ఎస్ విక్రాంత్”ను పేల్చాలని పాకిస్తాన్ నేవీ బేస్ కు చెందిన “ఘాజీ”ని పంపుతారు. ఈ విషయం తెలుసుకొన్న ఇండియన్ నేవీ బేస్ ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు “ఐ.ఎన్.ఎస్ రాజ్ పుత్”ను పంపుతాయి. సదరు సబ్ మెరైన్ కమాండర్ అయిన రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్) దూకుడు స్వభావి కావడంతో.. అతడు తీసుకొనే నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా చీఫ్ కమాండర్ టీమ్ మరో నేవీ అధికారి అర్జున్ (రానా)ను నియమిస్తారు.

తొలుత రెక్కీ నిర్వహించడమే ముఖ్య ధ్యేయంగా మొదలైన “ఐ.ఎన్.ఎస్ రాజ్ పుత్” ఊహించని విధంగా “ఘాజీ”తో డైరెక్ట్ ఎటాక్ కి దిగుతుంది. ఈ ప్రచ్చన్న యుద్ధంలో ఎవరు గెలిచారు? “ఘాజీ”పై ఎటాక్ చేసే సమయంలో “ఐ.ఎన్.ఎస్ రాజ్ పుత్” ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “ఘాజీ” కథాంశం.

నటీనటుల పనితీరు : అర్జున్ పాత్రలో రానా నిబద్ధత కలిగిన కమాండర్ గా పరిణితి చెందిన నటన కనబరిచాడు. తన చీఫ్ కమాండర్ తో విభేదించే సన్నివేశాల్లో, కమాండర్ స్థానంలో “ఘాజీ”పై ఎటాక్ చేసే సీన్స్ లో చక్కని నటన కనబరిచాడు.  కేకే.మీనన్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. రణ్ విజయ్ సింగ్ పాత్రకు తన హావభావాలతో డైలాగ్ డెలివరీతో అద్భుతంగా న్యాయం చేశాడు. అతుల్ కులకర్ణి సపోర్టింగ్ క్యారెక్టర్ లో సూపర్బ్ సపోర్ట్ అందించారు. తాప్సీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. కీలకపాత్రల్లో సత్యదేవ్, ప్రియదర్శి, నాజర్, ఓంపురిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : మధి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాకి వాడిన బ్రౌన్ మిక్స్డ్ ఆరెంజ్ టింట్ ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. అలాగే సబ్ మెరైన్ లోపల సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ను మెచ్చుకోవాలి. సబ్ మెరైన్ ఇన్నర్ వ్యూని క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఎడిటింగ్, లైటింగ్ వంటి సాంకేతికపరమైన విషయాలు బాగున్నాయి.

గుణ్ణం గంగరాజు సమకూర్చిన సంభాషణలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. దర్శకుడు సంకల్ప్ కథ-కథనంలో ఎక్కడా ల్యాగ్ అనేది లేకుండా చక్కగా తెరకెక్కించాడు. దర్శకత్వ శాఖలో అనుభవలేమీ కారణంగా దొర్లిన కొన్ని తప్పులు మినహా “ఘాజీ” చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడనే చెప్పాలి. ముఖ్యంగా సబ్ మెరైన్ మెకానిజాన్ని చాలా డీటైల్డ్ గా వివరించి విధానం, క్లైమాక్స్ లో వార్ ఎపిసోడ్ ను హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

విశ్లేషణ : కొన్ని సినిమాలు అలరిస్తాయి, ఇంకొన్ని సినిమాలు ఆకట్టుకొంటాయి. “ఘాజీ” ఒక అనుభూతిని మిగిల్చే చిత్రం. మనకు తెలియని యుద్ధం, మనకు తెలియని చరిత్రను తెలుసుకోవాలంటే “ఘాజీ” చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే!

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus