చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిర్మాతలే సొంతంగా ఈ సినిమాను అన్ని ఏరియాలలో విడుదల చేయగా ఈ సినిమాకు ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది. హిందీలో సైతం ఈ సినిమా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.
అయితే గాడ్ ఫాదర్ తమిళ వెర్షన్ అక్టోబర్ 14వ తేదీన తమిళనాడులో విడుదల కాగా అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతోంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించినా తమిళనాడులో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. తమిళంలో మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. చిరంజీవి ఇతర భాషలపై దృష్టి పెడుతున్నా ఇతర భాషల్లో ఆయన ఆశించిన రేంజ్ లో సినిమాలకు రెస్పాన్స్ రావడం లేదు.
గాడ్ ఫాదర్ సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. గాడ్ ఫాదర్ మూవీకి తమిళంలో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం కూడా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాకపోవడానికి కారణమైంది. దర్శకుడు మోహన్ రాజాకు మాత్రం ఈ సినిమా వల్ల కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
గాడ్ ఫాదర్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ కావడంతో లూసిఫర్ సినిమాను ఇప్పటికే చూసేసిన తమిళ ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమిళనాడులో ఈ సినిమాకు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రావడం అసాధ్యమని తేలిపోయింది. కాంతార సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా గాడ్ ఫాదర్ మూవీకి కలెక్షన్లు తగ్గడం గమనార్హం.