గోపీచంద్,నయనతార హీరోహీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని ‘జయ బాలాజీ రీల్ మీడియా’ బ్యానర్ పై నిర్మించాడు. 2017 వ సంవత్సరం జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ ఫైనాన్స్ సమస్యలు తలెత్తడంతో ఆగిపోయింది. సినిమా షూటింగ్ సగంలో ఉన్నప్పుడే ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి… ఆ టైములో ప్రముఖ నిర్మాత పి.వి.పి 9 కోట్లు చెల్లించి దీని హక్కులను సొంతం చేసుకోవాలనుకున్నాడట.
కానీ విడుదలయ్యే టైమ్ కు ఫైనాన్సియర్లు అడ్డుపడ్డారు. దాంతో కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. అయితే గత ఏడాది ఈ సినిమాని ఓటిటి లో విడుదల చేయమని నిర్మాత తాండ్ర రమేష్ కు మంచి ఆఫర్ వచ్చింది. ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి మొత్తం కలిపి రూ.18.8 కోట్లు ఖర్చు అయ్యిందట.ఇది మొత్తం వడ్డీలతో కలిపి అని తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న గోపీచంద్ మార్కెట్ ను
అలాగే తమిళంలో నయనతార మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రూ.15 కోట్ల వరకూ చెల్లించేందుకు ఓ ప్రముఖ ఓటిటి సంస్థ ముందుకు వచ్చిందట.వ్యూయర్ షిప్ ను బట్టి షేర్ కూడా ఇస్తామని కూడా వారు భరోసా ఇచ్చారట. కానీ ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ఎప్పుడో జీ టీవీ వారికి రూ.8 కోట్లకు అమ్మేసారట నిర్మాతలు. దాంతో ఓటిటి విడుదలకు ఆ సంస్థ అంగీకరించడం లేదని వినికిడి. గతేడాది నుండీ నిర్మాతలు ప్రయత్నిస్తున్నా వాళ్ళు నొ చెబుతూ వస్తున్నారట.