సినిమా విజయాల్లో సంగీతానికి ఎంతో కీలకమైన పాత్ర ఉంది. గతంలో ఇళయరాజా (Ilaiyaraaja), తర్వాత ఏఆర్ రెహమాన్ (A.R.Rahman), ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), తమన్ (S.S.Thaman) లాంటి సంగీత దర్శకులు ఇండస్ట్రీని శాసించారు. కానీ ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో హవా కొనసాగిస్తున్న అనిరుధ్ రవిచందర్‌కు (Anirudh Ravichander) ఊహించని షాక్ తగిలింది. గత పదేళ్లుగా అనిరుధ్ వరుస హిట్లతో మ్యూజిక్ ఇండస్ట్రీని తన ఆధీనంలో ఉంచుకున్నా, తాజాగా అతని స్థానంకు కాస్త పోటీ ఎదురవుతోంది.
ఈ మార్పుకు ప్రధాన కారణం జీవీ ప్రకాష్. గత కొంతకాలంగా అనిరుధ్ సంగీతంలో కొత్తదనం లేకుండా పోయిందని ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్. ఇండియన్ 2 (Indian 2), వేటయ్యన్ (Vettaiyan), విడాముయర్చి (Vidaamuyarchi) వంటి అతని ఇటీవలైన ప్రాజెక్టులు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదే సమయంలో జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) మ్యూజిక్ కంపోజర్‌గా రెండింతల స్పీడ్ పెంచి వరుస హిట్లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అమరన్ (Amaran), లక్కీ భాస్కర్ (Lucky Baskhar) సినిమాల విజయాల్లో అతని సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవడంతో నిర్మాతలు జీవీ ప్రకాష్ వైపు మొగ్గు చూపుతున్నారు.
సినిమా మ్యూజిక్ ప్రపంచంలో టాప్ పొజిషన్‌లో ఉండాలంటే, కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. ప్రాసెస్, మార్కెట్ ట్రెండ్, పారితోషికం అన్నీ కలిసిరావాలి. అనిరుధ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తుండగా, జీవీ ప్రకాష్ కేవలం రూ.10 కోట్లు లేదా అంతకన్నా తక్కువ పారితోషికంతోనే సినిమాలు ఒప్పుకుంటున్నాడట. ఈ భారీ రెమ్యునరేషన్ డిఫరెన్స్ వల్ల నిర్మాతలు జీవీ ప్రకాష్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పుడు జీవీ ప్రకాష్ చేతిలో అజిత్ (Ajith) – గుడ్ బ్యాడ్ అగ్లీ ( Good Bad Ugly) , ధనుష్ (Dhanush) – ఇడ్లీ కడై (Idly Kadai), కవిన్ – మాస్క్, శివకార్తికేయన్ (Sivakarthikeyan) – పరాశక్తి (Parasakthi) వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, తెలుగులో వెంకీ అట్లూరి (Venky Atluri) – సూర్య (Suriya) కాంబోలో ఓ సినిమా, వెట్రిమారన్ (Vetrimaaran) – వాడివాసల్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కావడంతో జీవీ ప్రకాష్ మార్కెట్ మరింత బలపడుతోంది.
ఈ పరిస్థితిలో అనిరుధ్ తన మ్యూజిక్‌లో మరింత వేరియేషన్ చూపించకపోతే, త్వరలోనే అతనికి స్థానభ్రంశం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవీ ప్రకాష్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. మ్యూజిక్ ఇండస్ట్రీలో తాజా ట్రెండ్‌ను అనుసరించకపోతే, అనిరుధ్ పరిస్థితి మరింత సంక్లిష్టం కానుంది.