అచ్చ తెలుగు ప్రేమకథలు తీయడంలో హను రాఘవపూడి లెక్కే వేరు. ‘అందాల రాక్షసి’ నుండి ‘సీతా రామం’ వరకు ఆయన పంథా ఎప్పుడూ డిఫరెంటే. అయితే అంతటి అచ్చ తెలుగు ప్రేమ కథల్లో తెలుగు అమ్మాయిలు ఎందుకు నటించరు అనే ప్రశ్న మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఇదే ప్రశ్న ఆయన దగ్గర వేస్తే.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడాయన మాటలు వైరల్‌గా మారాయి. ఆయన చెప్పింది నిజమే అని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు ఆ వాదన కరెక్ట్ కాదు అనేవాళ్లూ ఉన్నారు.
హను రాఘవపూడికి పుస్తకాలు కొనడం అలవాటట. అలా ఓసారి హైదరాబాద్‌లోని కోఠిలో కొన్న ఓ సెకండ్ హ్యాండ్ పుస్తకంలో ఓపెన్ చేయని ఓ లెటర్ కనిపించిందట. హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లేఖ అది. అందులో చూస్తే సెలవులకు ఇంటికి రమ్మని ఉందట. ఆ లెటర్ చూశాక.. ఒకవేళ లెటర్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అనే ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన నుండి పుట్టినదే ‘సీతారామం’ సినిమా అట.
సీత పాత్ర కోసం కథానాయిక ఎవరు అనుకుంటున్నప్పుడు… అమ్మాయి కొత్తగా ఉండాలని అనుకున్నాం. అప్పుడే మృణాల్ ఠాకూర్ పేరును నిర్మాత స్వప్న చెప్పారు. ఆమెను చూడగానే సీత పాత్రకు సరిపోతుందని అనిపించింది అని హను చెప్పారు. కొంతమంది తెలుగు అమ్మాయిని ఆ పాత్ర కోసం ఎందుకు తీసుకోలేదని అంటున్నారు. ‘‘అయితే తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించవు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు’’ అని క్లారిటీ ఇచ్చారు హను.
అంతేకాదు తెలుగు వాళ్లు దొరికితే మాకే హాయి.. భాష సమస్య ఉండదు అని అన్నారు హను. దేశభక్తి, ప్రేమ రెండింటినీ కలిపి యుద్ధంతో రాసిన ప్రేమకథ అని సినిమాకు ఎందుకు పెట్టాలనిపించిందనే విషయం కూడా హను చెప్పారు. ‘‘సినిమాలో ప్రతి పాత్ర తనలో తాను యుద్ధం చేసుకుంటూ ఉంటుంది. అందుకే యుద్ధంతో రాసిన ప్రేమకథ అని పెట్టాం అని పెట్టాం. అఫ్రిన్ పాత్ర అనుకోగానే రష్మిక అయితే బాగుంటుందనుకున్నాం. అనుకున్నట్లుగానే రష్మిక అద్భుతంగా చేసింది’’ అని పొగిడేశారు హను.