‘హనుమాన్’ (Hanu Man) సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) .2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘హనుమాన్’ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీని తర్వాత ప్రశాంత్ వర్మకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ఉంటుందని ముందుగానే ప్రకటించాడు. రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
మరోపక్క బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు అంటూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత న్యూస్ అయినప్పటికీ.. దీని గురించి మళ్ళీ మాట్లాడేలా చేసింది ‘హనుమాన్’ హీరోయిన్ అమృత అయ్యర్. విషయం ఏంటంటే.. తాజాగా అమృత అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టింది.
అది ఒక మీమ్. ఆ మీమ్లో ‘మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) – ప్రశాంత్ వర్మ..ల సినిమాని బాలకృష్ణ (Balakrishna) క్యాన్సిల్ చేశాడని, ప్రశాంత్ వర్మ తన అసిస్టెంట్ తో మోక్షజ్ఞ సినిమాని డైరెక్ట్ చేయించాలని చూశాడని, అందువల్ల ప్రశాంత్ వర్మకి బాలయ్య నుండి స్లిప్పర్ షాట్ తగిలినట్టు’ రాసి ఉంది. ఇలాంటి మీమ్స్ వైరల్ అవ్వడం కొత్త విషయం కాదు. కానీ దీన్ని ‘హనుమాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రశాంత్ వర్మకి అమృత అయ్యర్ కి.. మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, అందుకే ‘హనుమాన్’ ప్రమోషన్స్ లో అమృత అయ్యర్ (Amritha Aiyer) కనిపించలేదని, టీం కూడా ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించింది లేదు అని’ వార్తలు వచ్చాయి.
‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ప్రమోషన్స్ లో అమృత అయ్యర్.. ‘హనుమాన్’ గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. కొన్ని ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘నేను వేరే సినిమా పనుల్లో ఉండటం వల్ల ‘హనుమాన్’ ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. అక్కడితో ప్రశాంత్ వర్మ- అమృత అయ్యర్..ల మధ్య ఎటువంటి గొడవలు లేవేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇన్స్టా స్టోరీతో ఆ గొడవలు నిజమే అని సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.