ప్రపంచంలో ఇప్పుడు చాలామంది సూపర్ హీరోలు ఉండొచ్చు. అయితే వాళ్లంతా ఓ రచయిత కలం నుండి పుట్టిన వాళ్లే. అయితే తొలి తరం సూపర్ హీరో అంటే హనుమంతుడు అనే చెప్పాలి. ఎవరికీ సాధ్యం కానీ పనులు ఆయన చేశారు అని మన పురాణాలు చెబుతాయి. అలాంటి సూపర్ హీరో స్ఫూర్తితో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అలా అని ఇది కొత్త ప్రాజెక్ట్ అనుకునేరు. మహేష్‌బాబు సినిమా గురించే ఇదంతా.
మహేష్‌బాబు (Mahesh) కొత్త సినిమాను రాజమౌళి త్వరలో స్టార్ట్ చేస్తారనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా బాలారిష్టాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలై, ఆగిపోయింది.. మళ్లీ మొదలవ్వలేదు. త్వరలో అంటున్నారు కానీ చూడాలి. దీంతో రాజమౌళికి కొత్త సినిమాకు ఇంకా టైమ్ ఉంది. ఈ లోపు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం చూస్తే.. ఈ సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్‌లు కనిపిస్తాయని చెబుతున్నారు.
ప్రపంచ సాహసికుడి కథతో రాజమౌళి – మహేష్ సినిమా తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని చెప్పేశారు. అయితే కథేంటి, పాత్ర సంగతేంటి అనేది త్వరలో తెలుస్తుంది అని చెప్పారు. ఈలోపు రకరకాల పుకార్లు వస్తున్నాయి. దేశాన్ని చుట్టొచ్చే సూపర్ హీరో కథ ఇది అని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్రను హనుమంతుడి స్ఫూర్తితో ఉంటుందని చెబుతున్నారు. అంటే ఆంజనేయుడిలాగే.. ఈ సినిమాలో హీరో పాత్రకు తన బలం తెలియదట.
అడవి నేపథ్యంలో ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలో కథను సిద్ధం చేస్తూ ప్రధాన పాత్రకు రిఫరెన్స్‌గా పవనపుత్రుడిని తీసుకున్నారని సమాచారం. తన బలం తనకే తెలియకుండా.. అవసరమైనప్పుడు ఎంతటి సాహసమైనా చేసి విజయం సాధించేలా ఈ పాత్ర ఉంటుందట. మొదట అమాయకుడి షేడ్స్ చూపించి.. క్రమంగా కథ ముందుకు వెళ్లేకొద్దీ పాత్ర స్వభావంలో మార్పులు వచ్చేలా రాసుకున్నారట.