పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈరోజు అనగా జూలై 24న రిలీజ్ అయిన ఈ సినిమా… మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ దర్శకుడు జ్యోతి కృష్ణ టేకింగ్ చాలా బ్యాడ్ గా ఉందని.. వి.ఎఫ్.ఎక్స్ చాలా నాసిరకంగా ఉందని, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోని పెట్టుకుని ఇలాంటి కథనంతో సినిమా చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
నిర్మాత రూ.250 కోట్లు బడ్జెట్ పెట్టినా ఆ రేంజ్లో ఆకర్షించిన ఎలిమెంట్స్ ఏమీ లేవని అంతా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వంటి మాస్ కటౌట్ కి సంగీత దర్శకుడు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా సెట్ అయ్యిందని.. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేవని సోషల్ మీడియాలో ‘హరిహర వీరమల్లు’ ని ట్రోల్ చేస్తున్నారు.
అయితే ‘హరిహర వీరమల్లు’ కి మొదటి నుండి నెగిటివిటీనే ఉంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకోవడం.. తర్వాత కెరీర్లో ఒక్క హిట్టు కూడా లేని జ్యోతి కృష్ణ ప్రాజెక్టుని టేకప్ చేయడంతో అప్పటి నుండి ఈ ప్రాజెక్టు మీద అభిమానులకు ఉన్న ఆశలు అన్నీ సన్నగిల్లిపోయాయి. బయ్యర్స్ కూడా ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి భయపడ్డారు. అయితే ట్రైలర్ బాగుండడంతో మళ్ళీ అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. అలాగే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి వచ్చి మరీ సినిమాను పుష్ చేయడం మరింత ప్లస్ అయ్యింది అని చెప్పాలి. దీంతో ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ చిత్రం రూ.45 కోట్లు షేర్ ను(ప్రీమియర్స్ తో కలుపుకొని) కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రాస్ పరంగా రూ.85 కోట్ల వరకు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో.