ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కెమెరామెన్ చోటా కె నాయుడు పాల్గొని ‘ ‘ రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) సినిమాకి పనిచేస్తున్నప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ప్రతిదానికి అడ్డుపడిపోయేవాడు. అతని మైండ్ లో ఏదో ఉంటుంది. కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించే వాడిని. కానీ ఎందుకులే నేనే రాజీపడి కంప్లీట్ చేశాను ‘ అంటూ దర్శకుడు హరీష్ శంకర్ కి చురకలు అంటించాడు. దీనికి కౌంటర్ గా హరీష్ ఒక లెటర్ రిలీజ్ చేశాడు.
హరీష్ శంకర్ ఆ లెటర్ ద్వారా స్పందిస్తూ…”(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోటా కె నాయుడు (Chota K. Naidu) గారికి నమస్కరిస్తూ…. రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే, నేను ఓ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరరీతిలో మాట్లాడారు.
మీకు గుర్తుందో లేదో… ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ పెట్టుకుని షూటింగ్ కంప్లీట్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. కానీ రాజుగారు(దిల్ రాజు) (Dil Raju) చెప్పడం వల్లో, ‘గబ్బర్ సింగ్’ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామన్ ను తీసేస్తున్నాడు అని పది మంది అనుకుంటారన్న కారణం వల్లో… మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా సరే ఏ రోజూ ఆ నింద మీ మీద మోపలేదు.
‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) వచ్చినప్పుడు అది నాది, ‘రామయ్య వస్తావయ్యా’ విషయంలో అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డాను. కానీ నా స్నేహితులు, నన్ను అభిమానించేవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది.
మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు… మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను రెడీ!” అంటూ రాసుకొచ్చాడు.