చరిత్ర మరచిపోయిన కథలను, చరిత్రలో కలసిపోయిన కథలను, చరిత్రలో గుర్తుంచుకోదగ్గ కథలను ప్రస్తుతం మన సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జాతి గర్వించదగ్గ, గుర్తించదగ్గ ఎందరో ప్రముఖులు మనకు వెండితెరపై కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు రామ్‌చరణ్ – నిఖిల్ కలసి ఓ సినిమా సిద్ధం చేయబోతున్నారు. చరణ్ నిర్మాతగా నిఖిల్ హీరోగా ఈ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగింది. రామ్ చరణ్, అతని స్నేహితుడు విక్రమ్, అభిషేక్ అగర్వాల్ కలసి నిఖిల్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు.
‘ది ఇండియా హౌస్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో శివ పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్ కనిపించనుండగా, శ్యామ్ జీ కృష్ణ వర్మగా అనుపమ్ ఖేర్ నటిస్తారు. మన భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు లండన్ నేపథ్యంలో సాగే కథతో ‘ది ఇండియా హౌస్’ చిత్రాన్ని రూపొందిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌస్’ చిత్రాన్ని అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని రామ్ చరణ్ ట్వీట్ చేశారడు.
పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు. ‘ది ఇండియా హౌస్’ మోషన్ పోస్టర్ చూస్తే తగలబడుతున్న ఇల్లు ఉంది. దాని కంటే ముందు బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయిని చూపించారు. దీని బట్టి ఈ సినిమాలో ప్రేమ కథకు చోటు ఉందని అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నిఖిల్ జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా చెప్పలేదు.
లండన్‌లో ఉన్న ఓ ప్రముఖ ఇల్లు తగలబడిపోవడానికి కారణం ఏంటి? అనే అంశం చుట్టూ కథ ఉంటుంది అని అంటున్నారు. నిఖిల్ ఇప్పటికే ‘కార్తికేయ’ సిరీస్ సినిమాలతో నార్త్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ (Ram Charan) కూడా నార్త్‌లో మంచి ఫేమస్. కాబట్టి ఈ సినిమాకు భలే క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.