రజనీకాంత్ – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం… ఈ రెండూ వేర్వేరు పేర్లు కావొచ్చు. కానీ కొన్నేళ్లపాటు రజనీకాంత్ అంటే బాలసుబ్రహ్మణ్యం గొంతే. అంతలా మమేకం అయిపోయారు వాళ్లిద్దరూ. రజనీకాంత్ తెలుగు మాటలు అంటే బాలసుబ్రహ్మణ్యమే. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం మానేసినా… రజనీ సినిమా అంటే బాలు పాట ఉండాల్సిందే. ముఖ్యంగా సినిమా టైటిల్ సాంగ్‌ను బాలు పాడాల్సిందే. ఎస్పీబాలు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత విడుదలవుతున్న రజనీకాంత్ తొలి సినిమా ‘అన్నాత్తె’.
అయితే ఈ సినిమాలోనూ బాలు పాట ఉంది. అంతేకాదు బాలు కెరీర్‌లో ఆఖరి పాట కూడా ఇదే. ఈ పాటను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ‘‘45 ఏళ్ల పాటు ఎస్పీబీ నా స్వరంగా జీవించారు. ‘అన్నాత్తె’లో నా కోసం ఆయన పాడిన పాటే ఆఖరి పాట అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు’’ అని ట్వీట్ చేశారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నాత్తె’.
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార, కీర్తిసురేష్, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇమాన్ స్వరాలందించారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేస్తున్నారు.