Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్.. 37 ఏళ్లకు నార్త్ – సౌత్ మల్టీస్టారర్ విడుదల
- January 24, 2026 / 04:24 PM ISTByFilmy Focus Desk
ఆ మధ్య 12 ఏళ్ల పాత సినిమా లేట్‌గా రిలీజ్ అయి.. మంచి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత పాత కథ, సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఎలా ఆదరించారు. హీరో, హీరోయిన్ల ముఖాలు కూడా ఇప్పుడులా ఉండవు, మారిపోయి ఉంటాయి కదా అని అనుకున్నా.. ఆ సినిమాను ఆదరించేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అది 12 ఏళ్ల క్రితం సినిమా అయితే.. ఇప్పుడిది దానికి మూడు రెట్లు లేటు సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.
Hum Mein Shehenshah Kaun
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ దివంగత స్టార్ నటుడు శత్రుఘ్న సిన్హా, డ్రీమ్ గర్ల్ హేమా మాలిని ప్రధాన పాత్రల్లో 37 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘హమ్ మే షెహెన్‌షా కౌన్’. ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దివంగత హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి తాజాగా నిర్మాత ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాపై మేం ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, నిశబ్దంతో బాధని భరించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని బయటపడింది. త్వరలోనే విడుదల తేదీని చేస్తాం అని ఆ ప్రకటనలో చెప్పారు. అంతేకాదు ఈ సినిమాను సాంకేతికతను ఇంకాస్త ఎక్కువ నాణ్యతతో రిలీజ్ చేస్తున్నాం అని కూడా చెప్పారు. 1989లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ ఫిల్మ్‌నే ఇప్పుడు 4K టెక్నాలజీతో సిద్ధం చేశారట.
1989లో షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రాలేదు. వ్యక్తిగత కారణాల వల్లే సినిమా విడుదల ఆగిపోయింది. షూటింగ్ ముగిశాక నిర్మాత రాజా రాయ్ వ్యాపార పనిపై లండన్ వెళ్లారు. అక్కడ తన చిన్న కుమారుడు మరణించడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ బాధ నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా ఏళ్లు పట్టింది. ఆ తర్వాత సినిమాను విడుదల చేద్దామని అనుకుంటున్న సమయంలో దర్శకుడు హర్మేష్ మల్హోత్రా కన్నుమూశారు. ఇప్పుడు రెడీ చేశారు.













