తమిళంలోకంటే ఎక్కువ మంది తెలుగులో సంపాదించుకున్న కథానాయకుడు కార్తీ (Karthi) . సూర్య (Suriya) తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న కార్తీ తాజా తమిళ చిత్రం “మెయియాజగన్”. “96” ఫేమ్ ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో “సత్యం సుందరం” (Sathyam Sundaram) పేరుతో విడుదలవుతోంది. తమిళంలో సెప్టెంబర్ 27న విడుదలవుతున్న ఈ చిత్రం, తెలుగులో మాత్రం “దేవర”కు (Devara) పోటీగా నిలవకూడదనే సదుద్దేశంతో ఒకరోజు లేటుగా అంటే సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు కార్తీ (Karthi). ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? సూర్య ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? అరవిందస్వామి ఈ సినిమాకి ఎంత కీలకం? వంటి విషయాలను వివరించారు.
ఆయన దగ్గర నాకోసం ఒక కథ ఉందని తెలుసుకొని.. నేనే వెళ్లి అడిగాను
సాధారణంగా దర్శకులు కథలు తీసుకొని హీరోల దగ్గర్రకి వెళ్తారు. కానీ.. “సత్యం సుందరం” విషయంలో మాత్రం ప్రేమ్ కుమార్ దగ్గర నాకోసం (Karthi) సిద్ధం చేసిన ఒక కథ ఉందని తెలుసుకొని నేనే ఆయన దగ్గరకి వెళ్లి అడగ్గా.. ఆయన “నా దగ్గరున్న కథ చెప్పడానికి వీలుపడదు” అని చెప్పి ఒక నవల నా చేతిలో పెట్టారు. నేను నా బిజీ షెడ్యూల్లో మధ్యమధ్యలో నవల చదువుతూ నాలుగైదుసార్లు కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు ఫిక్స్ అయ్యాను ఈ సినిమా తప్పకుండా చేయాలి అని.
మనిషిలోని స్వచ్ఛమైన భావం కనుమరుగైపోతుంది..
కరోనా సమయంలో మనందరిలో ఒక ఆలోచన మొదలైంది. అసలు మన ప్రయాణం ఏమిటి అని అందరూ తమను తాము ప్రశ్నించుకున్నారు. “సత్యం సుందరం” అనే సినిమా మూలకథ అదే. ప్రస్తుత సమాజంలో పదేళ్ల పిల్లాడిలో కూడా సున్నితత్వం, అమాయకత్వం కనిపించడం లేదు. ఈ సినిమాలో ఆ అమాయకత్వం కనిపిస్తుంది.
అరవిందస్వామి ఒకే చెప్పకపోతే ప్రాజెక్ట్ డ్రాప్ చేసేవాళ్లం..
ఈ కథ గురించి అరవిందస్వామి (Arvind Swamy) గారికి చెప్పినప్పుడు ఆయన ఎంతగానో లీనమై.. ఈ కథ నా (Karthi) జీవితంలో నిజంగానే జరిగింది అని చెప్పి, వెంటనే నేనే చేస్తాను అని ఒప్పేసుకున్నారు. నిజానికి ఆయన ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగారంట. ఆయన్ని చూస్తేనేమో ఏదో బ్రిటిష్ యాక్టర్ లా ఉంటాడు (నవ్వుతూ). ఆయన ఈ సినిమా ఒకే చేయకపోయి ఉంటే మా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కథను నవలగా పబ్లిష్ చేసేవారు.
పల్లెటూర్లో ప్రతి ఒక్కరూ మన బంధువే..
సిటీలో మనకి కనీసం మన అపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు కూడా తెలియరు. కానీ.. పల్లెటూర్లో ఒక్కసారి అడుగుపెట్టగానే ప్రతి ఒక్కరూ ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకరికి ఒకరు తెలుసు. ఆ బంధాల్ని ప్రేక్షకులకు పరిచయం చేసే చిత్రమిది.
గోవింద్ వసంత ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్..
గోవింద్ వసంతకి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి అభిమానులున్నారు. ఆయన మొదటిసారి ఒక సినిమాని ఛాలెంజ్ గా ఫీలయ్యారు. అదే “సత్యం సుందరం”. చాలా లేయర్స్ ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్క ఎమోషన్ ను గోవింద్ అద్భుతంగా ఎలివేట్ చేశాడు.
కె.విశ్వనాథ్ గారి సినిమాలను మిస్ అవుతున్న లోటును తీర్చే సినిమా ఇది..
తెలుగులో ఒకప్పుడు కె.విశ్వనాథ్ ( K. Vishwanath) గారి సినిమాలు చాలా బాగుండేవి. చూస్తున్న ప్రేక్షకుడికి ప్రశాంతత ఇచ్చేవి. ఈమధ్యకాలంలో వయొలెన్స్ ఎక్కువైపోయింది. సెన్సార్ వాళ్లు కూడా వరుసబెట్టి అవే సినిమాలు చూసి బోర్ అయిపోయారు. అలాంటి సమయంలో విశ్వనాథ్ గారి సినిమాలాంటి ఫీల్ ఇచ్చే చిత్రమే “సత్యం సుందరం”.
మా అన్నయ్య కూడా అసూయపడ్డాడు..
ఈ కథ చదవమని అన్నయ్యకి ఇచ్చిన తర్వాత ఆయన చదివి “ఏంట్రా మంచి కథలన్నీ నీకే దొరుకుతాయి” అన్నాడు. ఈ సినిమాని నిర్మించాలన్నా ఒక ప్యాషన్ ఉండాలి. అందుకే అన్నయ్యను ప్రొడ్యూస్ చేయమని నేను రిక్వెస్ట్ చేసాను. ఆయనకి కూడా కథ నచ్చి ముందుకొచ్చారు. సొంత ప్రొడక్షన్ కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గాల్సి వచ్చింది అనుకోండి (నవ్వుతూ). చెప్పాలంటే.. నా పరిచయ చిత్రమైన పరుత్తివీరన్ తర్వాత అన్నయ్య సినిమా చూసి నన్ను హగ్ చేసుకున్న సినిమా “సత్యం సుందరం”.
కథను నమ్ముతాను అదే నా బలం…
నేను వరుసబెట్టి కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి కానీ, ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు ఒకే చేయడానికి కారణం వాళ్లు చెప్పే కథను బలంగా నమ్మడమే. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వచ్చి “ఖైదీ” (Kaithi) పాయింట్ చెప్పినపుడు, ఇది ఆర్నాల్డ్ రేంజ్ సినిమారా బాబు అని చెప్పాను.
జపాన్ పాయింట్ గా చాలా మంచి సినిమా..
జపాన్ (Japan) కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఒక పాయింట్ గా అది చాలా మంచి సినిమా. అలాంటి ఎండింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ వేరే హీరో ఎవరు చేయలేదు. చాలా కొత్తగా అనిపించి నా ల్యాండ్ మార్క్ సినిమాగా “జపాన్” చేసాను.
ఒక్క రోజు మాత్రం సూర్య అన్నయ్య టెన్షన్ పెట్టాడు..
నిర్మాతగా సినిమాను ఒకే చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం తప్ప ఎప్పడు నిర్మాణ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. పనులన్నీ కోప్రొడ్యూసర్ రాజశేఖర్ చూసుకునేవారు. అయితే ఒక్కరోజు మాత్రం నైట్ షూట్ కి వచ్చాడు. ఊర్లో జనాలకి ఎలా తెలిసిందో కానీ అందరూ వచ్చేశారు. దెబ్బకి మా షూటింగ్ కి సమస్య వచ్చింది. వెంటనే నేను అన్నయ్యని వెళ్లిపోమని చెప్పాను. అలాగే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కూడా 5 నెలల సమయం కావాలి అని అడిగినప్పుడు సినిమా గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఏమాత్రం ఇబ్బందిపెట్టలేదు.
భాషకు గౌరవం ఇవ్వాలి అందుకే తెలుగు టైటిల్ పెట్టాం..
ఈమధ్యకాలంలో తమిళ సినిమాలను తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కార్తీ.. “భాషకు గౌరవం ఇవ్వాలి, అందుకే మా సినిమాకు “సత్యం సుందరం” అనే మంచి టైటిల్ ను ఫిక్స్ చేశాం. తప్పకుండా అందరూ కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది” అంటూ ముగించారు.