దేవర (Devara) ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ అభిమాన సందోహం కారణంగా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులందరూ ఆర్గనైజర్స్ ను తిట్టిపోసి, కాలినడకన నోవొటెల్ వెన్యూ నుండి బయటకొస్తున్నారు. ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేందుకు చాలా కారణాలుండగా.. చిత్ర కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పుడే అభిమానులకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసాడు.
Jr NTR
ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణంగా ఆర్గనైజర్స్ ను లేదా నిర్మాతలను తిట్టడం సరికాదు. కొరటాల శివ సినిమాను చాలా కష్టపడి తీశాడు. మీరందరూ 27న థియేటర్లకు వచ్చి “దేవర”కు మీ ప్రేమను పంచండి. ముఖ్యంగా అందరూ ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లండి” అంటూ ముగించాడు. అంటే.. అందరూ అనుకుంటున్నట్లుగా మంగళవారం కానీ, బుధవారం కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం లేనట్లే.
అయితే ఆరేళ్ల తర్వాత తమ హీరోను చూద్దామని వేలాదిగా వచ్చిన వీరాభిమానులు మాత్రం శ్రేయాస్ మీడియా ఆర్గనైజర్స్ ను, ప్రొడ్యూసర్స్ & తారక్ టీమ్ ను సోషల్ మీడియా సాక్షిగా బూతులు తిడుతున్నారు. ఎలాగూ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగదు కాబట్టి, ప్రమోషన్స్ యొక్క మోతాదును ఇంకాస్త పెంచితే బాగుంటుంది. మరి సినిమా బృందం & పి.ఆర్ టీమ్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
ఈ ఈవెంట్ క్యాన్సిల్ అనేది అభిమానుల వరకు బాధాకరమైన వార్త అయినప్పటికీ.. ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా చేసిందని కూడా టాక్. నిజంగానే ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ విజయవంతంగా జరిగినా ఈ స్థాయిలో “దేవర” వైరల్ అయ్యేది కాదు. ఈ బజ్ అంతా సినిమాకి ఏస్థాయిలో ఉపయోగపడతాయో చూడాలి.