మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తనకంటూ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అతడి సినిమాలకు పాతిక నుండి ముప్పై కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం తేజు నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్ లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. కెరీర్ ఆరంభంలో ఈ హీరో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ.. కెరీర్ ఆరంభంలో అతడికి ఏదీ కలిసి రాలేదు. తేజు నటించిన మొదటి సినిమా ‘రేయ్’ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది.
విడుదల కూడా ఆలస్యమైంది. పోనీ సినిమా హిట్ అయిందా..? అంటే అదీ లేదు. ఈ సినిమా కంటే ముందు విడుదలైన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ షూటింగ్ సమయంలో కూడా తేజుకి కష్టాలు తప్పలేదు. సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా.. అందులో కీలకపాత్ర చేస్తున్న శ్రీహరి చనిపోయాడు. తరువాత జగపతిబాబుని ఆ పాత్రకు తీసుకున్నారు. సినిమా పూర్తి చేసి ఎలాగోలా రిలీజ్ చేశారు. హిట్ టాక్ రావడంతో తేజు దశ తిరిగింది. అయితే శ్రీహరి చనిపోవడం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితుల్లో తన సిట్యుయేషన్ మరింత దారుణంగా తయారైందంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఈ మెగాహీరో.
ఆ సమయంలో మెగాస్టార్ అభిమాని ఒకరు తనకు ఫోన్ చేసి సినిమాలు ఆపేయాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పటివరకు చేసింది చాలు.. నీకు సినిమాల్లో కలిసొచ్చేలా లేదు.. ఇక సినిమాలు ఆపేయ్ అని అతడు తనకు ఖరాఖండిగా చెప్పినట్లు తేజు తెలిపాడు. అప్పుడు తాను చేస్తున్న రెండు సినిమాలు పూర్తి చేసి.. అవి విడుదలయ్యాక తాను పనికి రానని ఫీలైతే కచ్చితంగా సినిమాలు మానేస్తానని ఆ అభిమానికి ఓపికగా సమాధానం చెప్పినట్లు వెల్లడించాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై హిట్ అందుకున్న తరువాత అదే అభిమాని తనకు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు తేజు చెప్పాడు.