అక్కినేని నాగేశ్వర రావు గారి మనవడిగా అలాగే నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కాలేకపోయాడు సుమంత్. 1999 లో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ప్రేమ కథ’ చిత్రంతో సుమంత్ హీరోగా పరిచయమయ్యాడు. తన మేనమామ నాగార్జునే ఈ చిత్రానికి నిర్మాత. కచ్చితంగా సుమంత్ కు ఇది మంచి విజయాన్ని అందించి.. పెద్ద హీరో అవ్వడానికి ఉపయోగ పడుతుంది అని అప్పట్లో అంతా అనుకున్నారట. కానీ కట్ చేస్తే ‘ప్రేమకథ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా ప్రారంభం నుండీ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోనే సాగుతుంది. కొంతమందికి ఈ చిత్రం చాలా నచ్చిందనే కామెంట్స్ కూడా చేశారట..! అయినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దీనికి కారణం ఏంటని సుమంత్ నే అడిగితే కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. సుమంత్ మాట్లాడుతూ.. ” ‘ప్రేమకథ’ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి మా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రత్యక్షంగా ఓ కారణం అయితే… పరోక్షంగా ‘టైటానిక్’ కారణం.! ‘ప్రేమకథ’ సినిమా క్లయిమాక్స్ లో హీరో, హీరోయిన్లు చనిపోతారు. ‘అలా పెట్టొద్దు.. సినిమా ఫ్లాప్ అయిపోద్ది’ అని నేను రాముతో(డైరెక్టర్) చెప్పాను.
కానీ అతను వింటే కదా..! ‘టైటానిక్’ సినిమా క్లయిమాక్స్ చూసినప్పుడు అతనికి చాలా ఏడ్పు వచ్చిందట. హీరోయిన్ మాత్రం బ్రతికి ఉండడం తనకి నచ్చలేదట. అందుకని నా సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరినీ చంపేశాడు. అందుకే ‘ప్రేమకథ’ ఫ్లాప్ అయ్యింది” అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు. ఇక తన మొదటి సినిమాకి 5 లక్షల పారితోషికం అందుకున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు సుమంత్.