తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయనకు చెందిన దళపతి మక్కల్ ఇయక్కం ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఈ సర్వేలు ముమ్మరంగా జరుగుతుండగానే మరో వైపు వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? అనే విషయమై ఆయన అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విజయ్ నాయకత్వంలోని దళపతి మక్కల్ ఇయక్కం రాజకీయ పార్టీగా మారనున్నట్లు కొన్నేళ్ళుగా వార్తలు వెలువడుతున్నాయి.
అయితే ఈ విషయమై విజయ్ ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనం పాటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం అభ్యర్థులు పలుచోట్ల గెలిచినప్పుడే విజయ్ రాజకీయ ప్రవేశం ఖాయమని ఆ ఇయక్కం నేతలంతా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తమిళ సంవత్సరాది రోజున దళపతి మక్కల్ ఇయక్కం ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా రాజ్యాగం నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇయక్కం జిల్లాస్థాయి నాయకులంతా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అలర్పించారు. అదే సమయంలో మునుపెన్నడూ లేని విధంగా విజయ్ మక్కల్ ఇయక్కం రాష్ట్రమంతటా ఇఫ్తార్ విందులను కూడా ఘనంగా నిర్వహించింది. ఇవన్నీ విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందస్తు చర్యలని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆయా జిల్లాలకు చెందిన ఇయక్కం నిర్వాహకులు ఈ సర్వేలను జరుపుతున్నారు.
వచ్చే నెల సర్వేలు పూర్తి చేసి ఆ దరఖాస్తులన్నింటిని విజయ్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత జిల్లా శాఖ నాయకులతో ఆయన సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే విషయంగా చర్చలు జరుపుతారని ఆ ఇయక్కం నిర్వాహకులు కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి విజయ్ రాజకీయ రంగప్రవేశం తథ్యమని చెప్పారు. ప్రస్తుతం తన మక్కల్ ఇయక్కంను గ్రామీణ స్థాయిలోనూ బలోపేతం చేసేందుకు ఆయన చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది.