తమిళ స్టార్ ధనుష్ కి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్ తన కొడుకునంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్ పై ధనుష్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. ధనుష్ తమ కొడుకేనంటూ మధురైలోని వేలూరుకు చెందిన కతిసేరన్, మీనాక్షి అనే దంపతులు అప్పట్లో మద్రాస్ హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ధనుష్ కి కోర్టుకి సబ్మిట్ చేసిన జనన ధృవీకరణ పత్రాలు ఫేక్ అని ఆరోపిస్తూ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు.
ధనుష్ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్‌లో పేర్కొన్నారు వృద్ధ దంపతులు. ధనుష్ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. దీనికి సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌ను కూడా కోర్టుకి సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా..
ధనుష్, అతని తరపు న్యాయవాది దానికి ఒప్పుకోలేదు. అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షల ఫలితాలు ధనుష్‌కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని 2020లో ఈ కేసును కొట్టేశారు. జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కతిసేరన్ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటి వరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసుల విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినని.. తన నుంచి డబ్బులు ఆశించే ఇలాంటి తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.