విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ (Family Star) చిత్రంలో నిరాశపరిచిన విజయ్, ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గౌతమ్ తిన్ననూరి సినిమా తరువాత విజయ్ తన 14వ సినిమాగా రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ భారీ పీరియాడికల్ వార్ డ్రామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ చారిత్రాత్మక నేపథ్యంతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిగిన విభిన్నమైన కాన్సెప్ట్‌గా ఉండనుంది.
ఈ పీరియాడికల్ చిత్రంలో విలన్ పాత్రకు ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూను ఎంపిక చేసే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు టాక్. ‘ది మమ్మీ’ మరియు ‘ది మమ్మీ రిటర్న్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో విలన్ పాత్రలో ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సౌత్ సినిమాల వైపు దృష్టి సారించిన ఆయన, కథలో బలమైన పాత్ర ఉంటే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు రాహుల్ ఆయన్ను ఈ సినిమాలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
విజయ్ దేవరకొండతో రాహుల్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) వంటి విజయంతో రాహుల్ తన సత్తాను చాటుకున్నాడు. అలాగే, ‘శ్యామ్ సింగరాయ్’తో (Shyam Singha Roy) తాను డిఫరెంట్ కాన్సెప్ట్‌లను విభిన్నంగా తెరకెక్కించగలమని నిరూపించుకున్నాడు. ఈ సక్సెస్ నేపథ్యంతో రౌడీ స్టార్ విజయ్‌తో కలిసి పీరియాడికల్ వార్ డ్రామా చేయడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
విజయ్ అభిమానులు ఈ సినిమాలో హాలీవుడ్ విలన్ పాత్ర ద్వారా రాహుల్ మరో సరికొత్త తరహా కథను తెరపైకి తీసుకొస్తారనే నమ్మకంలో ఉన్నారు. ఈ సినిమాతో విజయ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉంది. త్వరలోనే వరుసగా అప్డేట్స్ రానున్నట్లు సమాచారం.