‘ప్రాజెక్ట్ కె’ కథేంటి.. అందులో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అనే విషయంలో సరైన స్పష్టత లేనప్పటికీ… సమ్‌థింగ్ స్పెషల్ అని మాత్రం అనుకుంటున్నారు. దానికి కారణం ఇప్పటివరకు సినిమాకు సంబంధించి వచ్చిన లీక్స్, అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో డైరక్ట్‌గా, ఇన్‌డైరక్ట్‌గా చెబుతున్న విషయాలు. దాంతో ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు సినిమాను లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా ఊహించేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలో కార్ల గురించి ఆనంద్ మహీంద్రాకే ట్వీట్లు చేశారు నాగ్ అశ్విన్.
తమ సినిమా కోసం మీ టీమ్ సాయం కావాలని అడిగారు. దానికి ఆయన కూడా సరే అన్నారు. అయితే ఈ కాంబినేషన్లో రూపొందించిన ప్రత్యేక వాహనాలు వచ్చేసినట్లు సమాచారం. అయితే నాగ్‌అశ్విన్ టీమ్ ఏమడిగారు, ఏమిచ్చారు అనేది సరిగ్గా తెలియకపోయినా హైదరాబాద్‌లో అయితే డిఫరెంట్, భారీ కార్లు అయితే వచ్చాయి అని చెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ, వైవిధ్యమైన కార్లను చూడొచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఆ స్టూడియోలో భారీ సెట్ వేసి అక్కడ ఆ కార్లతో పోరాటాలు,
ఛేజింగులు చిత్రీకరిస్తున్నారట. అందులో ప్రభాస్, దీపికా పడుకొనె నటిస్తున్నారని సమాచారం. కారు ఛేజింగ్ సన్నివేశాలతోపాటు, కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశానలు కూడా రామోజీ పిలిం సిటీలోనే తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలోనే విలాసవంతమైన కార్లు కనిపించాయి అని చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ కథ, భారీ బడ్జెట్, అంతకుమించిన స్టార్ కాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్ నటులు నటిస్తున్నారట. టైమ్ ట్రావెల్ కథా నేపథ్యంలోనే సినిమా ఉంటుందని చెబుతున్నారు. ‘సలార్’ సినిమాను షూటింగ్‌ను కొన్ని రోజులు ఆపి మరీ ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్లు ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం అని చెబుతున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కాస్త ఎక్కువ సమయమే పడుతుంది అని చెబుతున్నారు.