మహేష్ బాబు కెరీర్ ప్రారంభించినప్పుడు ‘రాజకుమారుడు’ ‘మురారి’ చిత్రాల హిట్లతోనే చాలా కాలం గడిపాడు. అతను స్టార్ హీరో అవ్వడానికి ఇంకో పెద్ద హిట్ అవసరం అనుకున్న టైంలో ‘ఒక్కడు’ సినిమా వచ్చింది. 2003 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో మాత్రమే కాదు టాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి మహేష్ ను స్టార్ హీరోని చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యం.యస్.రాజు నిర్మించారు.
ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అనే ఒక్క మాటతో సరిపెట్టేయడానికి ఎవ్వరి మనసు అంగీకరించదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అన్నిటికీ మించి మహేష్ నటన ఎస్సెట్ అని చెప్పాలి. మహేష్ హీరోయిజానికి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలెట్ అని చెప్పాలి. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత కూడా ఇలాంటి సినిమా ఎందుకు తీయలేకపోయానే అని బాధపడినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇక ఈరోజు(ఆగస్టు 9న) మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ‘ఒక్కడు’ చిత్రాన్ని చాలా థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు.ఇప్పటి జెనరేషన్లో ఉన్న మహేష్ అభిమానులు..అంటే ‘ఒక్కడు’ ని థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు మహేష్ పుట్టినరోజు నాడు ఆ ఫీల్ ను అనుభవించాలనే ఉద్దేశంతో ఈ షోని ఏర్పాటు చేశారు. ‘ఒక్కడు’ రీమాస్టర్డ్ కాపీనే అయినప్పటికీ ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టు అభిమానులు హంగామా చేశారు.
హైదరాబాద్ లోని ఓ థియేటర్లో ‘ఒక్కడు’ దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కూడా ఈ స్పెషల్ షో చూడటానికి ప్రత్యేకంగా విచ్చేసారు. థియేటర్లో ఫ్యాన్స్ హంగామా చూసి వారు కూడా షాక్ అయ్యారు. షోకి కొన్ని గంటల ముందే ఆయా సినిమా థియేటర్లకు చేరుకున్న అభిమానులు ‘జై బాబు’ అంటూ పెద్ద ఎత్తున సందడి చేశారు.