వెంకటేశ్ సినిమాల్లో ఎంత జోవియల్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. అయితే దానికి ఆథ్యాత్మిక చింతన అనేది యాడ్ అవుతుంది. ప్రతి విషయంలో అలాంటి విషయాలను ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా మాట్లాడుతూ ఉంటారాయన. తాజాగా ఆయన ‘వెంకటేశ్ 75’ కార్యక్రమంలోనూ ఈ విషయం గురించి ప్రస్తావించారు. అంతేకాదు తాను ఓ దశలో అన్నీ వదిలేసి హిమాలయలకు వెళ్లిపోదాం అనుకున్నానని చెప్పారు. సినిమాలు ప్రారంభించే సమయంలో ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదు.
నాన్న కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే హీరోను అయ్యాను అని చెప్పారు వెంకటేశ్. చాలాసార్లు సినిమాలను వదిలి పెట్టి దూరంగా వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చేవారు. నా తోటి హీరోలు బాలకృష్ణ, నాగార్జున పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అలా హిమాలయాలకు వెళ్లకుండా సినిమా కెరీర్‌ను కొనసాగించాను అని వెంకీ తెలిపారు. నాకు తెలిసినంతవరకు కృషి, పట్టుదల, నిలకడతోనే ఎక్కడైనా విజయాలు సాధ్యం అవుతాయి.
హైరానా పడకుండా సహజంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. సానుకూల ధోరణిని అలవాటు చేసుకుని నేను సహజంగా ఉండగలుగుతున్నాను. అందరూ ఇదే తత్వాన్ని అలవర్చుకోవాలి అని సూచించారు. ఇక తన ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం గొప్పది అని చెప్పారు. ఇక చిరంజీవి చెప్పినట్లు తనకు కూడా మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని, త్వరలో చేస్తాను అని కూడా చెప్పారు. దీంతో ఇద్దరు హీరోలు ఇదే మాట చెప్పడం ఆసక్తికరంగా మారింది.
సభాముఖంగా చెప్పారా? లేక ఏమైనా ఆలోచన ముందుకు వెళ్లిందా అనేది చర్చగా మారింది. గతంలో ఓసారి ఇలానే పుకార్లు వచ్చినా ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అయితే చూడటానికి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే వెంకటేశ్ పవన్ కల్యాణ్ కలసి ‘గోపాల గోపాల’ చేశారు. వెంకీ, వరుణ్ తేజ్ కలసి ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశారు. అలాగే పవన్ కల్యాణ్ – రానా కలసి ‘భీమ్లా నాయక్’ చేశారు. దీంతో మెగా – విక్టరీ (Venkatesh) కాంబో ఎప్పుడూ ఇంట్రెస్టింగే.