రామ్ చరణ్ సినిమా థియేటర్ లోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. తన తోటి హీరోలు ఇదే సంవత్సరంలో నాలుగేసి సినిమాలు చేస్తున్నా తాను మాత్రం ‘నిదానమే ప్రధానం’ అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఓ రకంగా ఇదీ మంచిదే. ఆయనకు ఇప్పుడు వేగం కంటే విజయమే ప్రధానం. అందుకే ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్న సినిమాని రీమేక్ చేసి సేఫ్ గేమ్ మొదలెట్టారు. ఇక ఈ సినిమా కోసం అతడి అభిమానుల ఎదురుచూపులా మాటేమో గానీ ఓ దర్శక నటుడు మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతడే ఆర్పీ పట్నాయక్.
సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేసిన ఆర్పీ తర్వాత మెగాఫోన్ పై మక్కువ పెంచుకున్న ముచ్చట తెలిసిందే. బ్రోకర్, తులసిదళం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆర్పీ తన కథలను సామజిక కోణంలో నడుపుతుంటారు. ఆ కోవలోనే ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘మనలో ఒకడు’. జర్నలిజం నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాతి సినిమా కోసం కూడా కథ సిద్ధం చేసుకున్నానన్న ఈ మాజీ సంగీత దర్శకుడు ఆ సినిమా వివరాలు చెప్పేముందు రామ్ చరణ్ ‘ధృవ’ చూడాలని చెప్పుకొచ్చారు. దానికి కారణం ఆ కథ మెడికల్ మాఫియాతో ముడిపడి ఉండడమే. అదీ విషయం..!