టాలీవుడ్‌లో (Tollywood) ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ తీవ్రంగా దృష్టి పెట్టింది. ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన దేవర (Devara) సినిమా ఫైనాన్షియర్ సత్య రంగయ్య నివాసంపై ఐటీ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలపై అధికారులు క్లారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు. దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్, N.T.R. ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ అయినప్పటికీ, ఆర్థిక లావాదేవీలు పక్కాగా ఉన్నాయా? అనే అనుమానాలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఫైనాన్షియర్లకు పెట్టుబడులు ఎలా సమకూరుతున్నాయి? బడ్జెట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? పన్ను చెల్లింపుల విషయంలో లోపాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మరోవైపు, మరో ప్రముఖ నిర్మాత, కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ సాధించిన అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) నివాసంలో కూడా ఐటీ సోదాలు జరిగాయి.
పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన ఇతర సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు అధికారులు ఈ దాడులు జరిపారని టాక్. కార్తికేయ 2 సినిమా భారీ వసూళ్లు సాధించినప్పటికీ, ఆ వసూళ్లకు సంబంధించిన పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగాయా? అనే దానిపై కూడా ఐటీ శాఖ దృష్టి సారించినట్లు టాక్. పాన్ ఇండియా చిత్రాల బడ్జెట్, లావాదేవీలపై ఐటీ శాఖ ఈ స్థాయిలో దాడులు జరపడం పరిశ్రమలోని వాణిజ్య విధానాలపై కొత్త చర్చలకు దారితీసింది.
భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టుబడులు ఎలా సమకూరుస్తున్నారు? విదేశీ మార్కెట్లో కలెక్షన్లు ఎలా సుదీర్ఘ కాలం కొనసాగుతాయి? వంటి అంశాలను ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల ప్రభావం టాలీవుడ్‌లో (Tollywood) ఇంకా ఎంతవరకు ఉంటుందో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించిన ఈ సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై మరింత పారదర్శకత రావడం పరిశ్రమకు ఉపయోగపడుతుందన్నది స్పష్టమైంది.