25 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకా అని చూస్తే ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టి పాత్రకు సంబంధించిన ఓ వార్త గురించి మరోసారి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలోకి ఆయన రావడం వెనుక ఏం జరిగింది, ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి, ఎందుకు అగ్ర హీరోలు చాలా మంది ఆ పాత్రను చేయలేదు, ఆ క్యారెక్టర్‌ను ఆయన ఎలా చేశారు అనేదే ఆ డిస్కషన్ సారాంశం. సినిమా పేరు చెప్పలేదు కదా.. ‘కండుకొండైన్ కండుకొండైన్’. అదేనండీ ‘ప్రియురాలు పిలిచింది’.
Priyuralu Pilichindi
ఈ సినిమా పేరు ఎత్తగానే 90ల ఆఖరి రోజుల యూత్‌కి, 2000 బ్యాచ్ యూత్‌కి గుర్తొచ్చేది ‘గంధపు గాలికి..’ పాట. అజిత్ – టబు మధ్య తెరకెక్కిన ఆ పాట ఓ అద్భుతమే అని చెప్పాలి. ఆ విషయం తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు మమ్ముట్టి గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌కు జంటగా మమ్ముట్టి నటించారు. యుద్ధంలో ఓ కాలు కోల్పోయిన మేజర్ బాల పాత్రలో మమ్ముక్క జీవించేశారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఆ పాత్ర మమ్ముట్ట ముందు చాలామంది స్టార్స్ దగ్గరకు వెళ్లిందట. బాల పాత్ర గొప్పతనం ఆ నటుడి నడకలోనే ఉంటుంది. కాలు కోల్పోయిన వ్యక్తిగా నటించడానికి ఆ రోజుల్లో హీరోలు ఎవరూ అంగీకరించలేదు. ఒక కాలు ఉన్న పాత్రలో నటించడం మాకు ఇష్టం లేదని చెప్పేశారు. అప్పుడు మమ్ముట్టి ఆ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు. అది లోపంగా ఆయన భావించలేదు అని దర్శకుడు రాజీవ్ తెలిపారు. మేం అనుకున్నట్లుగానే మమ్ముట్టి నడుస్తున్నప్పుడు కుడి వైపునకు వంగి నడిచారు. పాత్ర అద్భుతంగా వచ్చింది అని చెప్పారు డైరక్టర్.
అలా ఆ పాత్ర అనుకోని విధంగా మమ్ముట్టి దగ్గరకు వచ్చింది. ఆయన తనదైన శైలిలో అద్భుతంగా నడిచి / నటించి మెప్పించారు. వేరే నటుడు అయితే ఎలా చేసుండేవారో అనే థాట్ కూడా రాకుండా మమ్ముక్క కేక పుట్టించారు మరి.