‘చూడాలని ఉంది’ అనే సూపర్ హిట్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ ‘ఇద్దరు మిత్రులు’ అనే చిత్రాలు ఎందుకో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మెగాస్టార్ అభిమానులు అలాగే చిరంజీవి కొంత వరకూ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి టైములో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో ‘అన్నయ్య’ అనే చిత్రం చేశారు చిరు. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రవితేజ, వెంకట్ వంటి అప్పటి యంగ్ హీరోలు మెగాస్టార్ తమ్ముళ్లుగా నటించారు.
మిలీనియం ప్రారంభంలో అంటే 2000 వ సంవత్సరం జనవరి 7న ఈ చిత్రం విడుదలయ్యింది. సంక్రాంతికి ఓ వారం ముందు విడుదలైన ఈ చిత్రానికి వారం రోజుల పాటు పక్కన పోటీగా మరే చిత్రం లేకపోవడంతో బాగా క్యాష్ చేసుకుందని చెప్పొచ్చు. మణిశర్మ సంగీతం, మెగాస్టార్ కామెడీ, సౌందర్య గ్లామర్ కలగలిపి ఈ చిత్రాన్ని హిట్ గా నిలబెట్టాయి. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 21ఏళ్ళు పూర్తవుతుంది. అప్పటి రోజుల్లో ఈ చిత్రం 2వారాలకే 6కోట్ల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఫుల్ రన్ ముగిసే సరికి 7.3కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘అన్నయ్య’ రిలీజ్ అయిన వారం రోజుల తరువాత.. బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ వెంకటేష్ ‘కలిసుందాం రా’, మోహన్ బాబు ‘పోస్ట్ మెన్’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ‘అన్నయ్య’ కలెక్షన్స్ డల్ అయ్యాయని చెప్పొచ్చు. ఫైనల్ గా ‘అన్నయ్య’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా.. హిట్ అనే టాక్ తో సరిపెట్టుకుని మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లకు బ్రేక్ వేసింది.