20 సంవత్సరాల వయస్సులోనే స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. చిన్నతనంలో బాగా అల్లరి చేసేవాడని పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అల్లరి హద్దులు దాటడంతో యంగ్ టైగర్ ఎన్టీఅర్ తల్లి చేతిలో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. బాల రామాయణం సినిమాలో అద్భుతంగా నటించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు అందుకున్నారు.
హరికృష్ణ, రాఘవేంద్ర రావు సపోర్ట్ వల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నిన్ను చూడాలని సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. తొలి సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ కు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది. వీఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా చూసిన సినీ పెద్దలు మాత్రం ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ నటన గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అద్భుతంగా నటించాడని, తాత పోలికలు ఉన్నాయని, ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో దొరికినట్టేనని, తారక్ భవిష్యత్తు బంగారంలా ఉంటుందని చర్చించుకున్నారని సమాచారం. ఆ సినీ పెద్దల అంచనాలకు అనుగుణంగానే ఎన్టీఆర్ హీరోగా నటించిన రెండో సినిమా స్టూడెంట్ నంబర్1 తో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఆది, సింహాద్రి ఘనవిజయాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను సైతం ఆచితూచి ఎంచుకుంటున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాలు విడుదల కానున్నాయి. త్వరలో ఎన్టీఆర్30 మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.