‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎలా ఉండబోతోంది అనేది రిలీజ్‌కు దగ్గర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకుందాం. నిజానికి ఈపాటికే సినిమా విడుదల అయిపోయుండాలి. అయితే ఆ మాయదారి కరోనా లేకపోతే ఇప్పుడు రికార్డులు గురించి మాట్లాడేవాళ్లం. ఇదంతా పక్కన పెడదాం. ముందుగా అనుకున్నట్లు రిలీజ్ ప్లాన్స్ గురించి చూద్దాం. సినిమాను విజయదశమి కానుకగా విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. అక్టోబరు 8 అంటూ సినిమాలో నటిస్తున్న ఓ హాలీవుడ్ నటి పోస్టు పెట్టి డిలీట్ చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో సినిమా విడుదల విషయంలో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది.
భారతీయ సినిమా అంతర్జాతీయ వేదికపై ఓ వెలుగు వెలిగించి రాజమౌళి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి అగ్రహీరోలు, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్ నటిస్తుండటంతో ఆ అంచనాలు ఇంకా ఉన్నాయి. దీంతో సినిమా విడుదల తేదీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదు.. కానీ విడుదల తేదీ మాత్రం చూచాయగా బయటికొచ్చేసింది. అదే అక్టోబరు 8. ఈ విషయాన్ని సినిమాలో నటిస్తున్న ఎలిసన్ డూడీ పోస్టు పెట్టి డిలీట్ చేసింది.ఒకవేళ ఆ తేదీనే ఫిక్స్ అనుకుంటే… ముందు చెప్పినట్లు పోటీ తప్పనిసరి.
జేమ్ బాండ్ సిరీస్ నుంచి రూపొందిన తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’. ఈ సినిమాను అక్టోబరు 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను గతేడాది నవంబరు 20న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా కుదర్లేదు. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నా… ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం, చాలా దేశాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఆ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆఖరికి అక్టోబరు 8ని ఎంచుకున్నారు. దీంతో ‘బాండ్ వర్సెస్ ఆర్‌ఆర్‌ఆర్’ అనే పోటీ ముందుకొచ్చింది. ఒకవేళ ఈ పోటీ ఉంటే… ‘ఆర్‌ఆర్‌ఆర్’కు అంతర్జాతీయంగా అంత స్పాన్ ఉండదు అని విశ్లేషకుల అంచనా.
ఎలీసన్ డూడీ రిలీజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి డిలీట్ చేయడం వెనుక.. ఇదే కారణమని కూడా అంటున్నారు. చిత్రబృందంలో చర్చకు వచ్చిన అంశాన్ని ఆమె ట్వీట్ చేశారు. అయితే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందమే ఆ పోస్టు డిలీట్ చేయించిందని తొలుత వార్తలొచ్చాయి. కానీ బాండ్ వర్సెస్ ఆర్‌ఆర్‌ఆర్ అనే కాన్సెప్ట్ కారణంగానే పోస్టు డిలీట్ చేయించారని ఇప్పుడు అంటున్నారు. దీనిపై చిత్రబృందం ఏమంటుందో చూడాలి.