సినిమాలో కనిపించేవి కొన్ని సన్నివేశాలైనా.. ఇప్పటికీ ‘సై’ సినిమా పేరు ఎత్తితే గుర్తొచ్చే నటుల్లో వేణు మాధవ్ ఒకరు. ఆ సినిమాలో నల్ల బాలు అనే పాత్రలో అప్పుడప్పుడు కనిపించి నవ్వులు పువ్వులు పూయించాడు. ‘నల్ల బాలు.. నల్ల తాచు లెక్క. నాకి చంపేస్తా’ అంటూ ఓ డిఫరెంట్ యాటిట్యూడ్‌తో అలరించాడు. అయితే ఆ పాత్రకు అన్ని సన్నివేశాలు తొలుత లేవంట. ఒక్క సీన్ అనుకుంటే.. ఏకంగా మూడు సీన్లు చేసి పాత్ర గుర్తుండిపోయింది. ఇంతకీ ఏమైందంటే?
స్క్రిప్ట్ పరిధి దాటి సన్నివేశాలు తీయడం అరుదు. మరీ సినిమాలో ఆ సీన్ ఉంటే బాగుంటుంది అని టీమ్ అనుకుంటే తప్ప. ‘సై’ సినిమాలో అనుకోకుండా యాడ్ చేసిన సన్నివేశాలే వేణు మాధవ్ చేసినవి. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్ కామెడీ ట్రాక్‌ను ఎవరూ తొలుత ఒక్క సీన్‌కే పరిమితం చేద్దాం అనుకున్నారట. గోడలపై పెయింట్‌లు వేయించే వ్యక్తిగా స్టూడెంట్స్, పోలీస్, విలన్‌లను బెదిరించి ఇరుకున పడే వ్యక్తిగా వేణు మాధవ్ చక్కటి హాస్యాన్ని పంచడం మీరు చూసే ఉంటారు.
ముందుగా చెప్పినట్లే తొలుత వేణు మాధవ్ కోసం ఒకే సన్నివేశాన్నే రాసుకున్నారట రాజమౌళి. స్టూడెంట్స్‌ను బెదిరిస్తూ ‘నల్లబాలు.. నల్లత్రాచు లెక్క.. నాకి చంపేస్తా’ అంటూ డైలాగ్‌లు చెబుతుంటే కట్ కూడా చెప్పకుండా రాజమౌళి పడిపడి నవ్వారట. కొన్ని రోజుల తర్వాత ఆ సన్నివేశాలను ఎడిట్ చేస్తుండగా.. ‘ఈ ట్రాక్ ఇంకా పెంచితే సినిమాకు ఎసెట్ అవుతుంది’ అని అనుకున్నారట. దీంతో మళ్లీ వేణు మాధవ్‌కు కబురు పెట్టారట. ‘‘ఈ ట్రాక్ ఇంకా పెంచాలి ఏం చేస్తే బాగుంటుంది’’ అని రాజమౌళి…
వేణు మాధవ్‌నే అడిగారట. దీంతో ‘‘ఈ సినిమాలో పాత్రలేంటో చెప్పండి.. డెవలప్ చేద్దాం’’ అని అన్నారట వేణుమాధవ్. ఏసీపీ అరవింద్, భిక్షు యాదవ్ పాత్రల గురించి చెబితే. అప్పుడు వాళ్లతో వచ్చిన సన్నివేశాలను సిద్ధం చేసుకున్నారట. అయితే ప్రదీప్ రావత్ (భిక్షు యాదవ్) హైట్‌కు సరిపడేలా వేణు మాధవ్‌కి ఓ పీట వేశారట. అయితే పీట మీద నిల్చుంటే సీన్ అంత బాగా రాదని, హైట్ తక్కువలోనే ఉండి వార్నింగ్ ఇస్తే బాగుంటుందని అన్నారట వేణు మాధవ్. దాంతో ఆ సీన్ అలానే తీశారట. ఆ హైట్ డిఫరెన్సే సినిమాలలో ఆ సీన్‌ను పీక్స్‌కి తీసుకెళ్లింది అని చెప్పొచ్చు.